Telangana Thirumala :తెలంగాణలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమల వెళ్లొచ్చినంత ఫలితం!
తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయం రోజురోజుకీ మరింత అభివృద్ధి చెందుతోంది. తిరుమల స్వామివారి సన్నిధిలో ఉన్నామా అనిపించే పరిసరాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మపూర్ లో కొలువైన ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుమల తిరుపతిగా పిలుస్తారు. కొండ మీద వెలసిన స్వామివారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా.. బీర్కూర్ శివారులో రెండు కొండల మధ్య వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయం పేరొందింది. తొలుత తిమ్మాపూర్ కు చెందిన బ్రహ్మంచారి అనే భక్తుడు ఏడు కొండలపై ఉన్న భక్తితో సిమెంట్ తో తయారు చేయించిన వెంకన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేసేవాడు. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడంతో కొండపైకి కాలినడకన వెళ్లడం ఇబ్బందిగా మారడంతో బీర్కూర్ కు చెందిన బన్సీలాల్ 1976లో 342 మెట్లు కట్టించారు. ఆ తర్వాత బాన్సువాడ, బీర్కూర్ మండలాలకు చెందిన నాయకులు 2007లో కొండపైకి సిమెంట్ రోడ్డు వేశారు. శాసన సభాపతి, ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాస్ రెడ్డి 40 లక్షల వ్యయంతో ఆలయాన్ని పునర్ నిర్మించారు. ఆరేళ్ల క్రితం అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి తెలంగాణ తిరుమల-తిరుపతి దేవస్థానంగా నామకరణం చేశారు.
Alsdo Read: ఈ ఆరురాశుల వారు ఈ జ్యోతిర్లింగాలను పూజించి, ఈ శ్లోకం చదువుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది
ప్రత్యేక అతిథి గృహం
కొండపైన ఆరుగురు దాతల సహకారంతో రూ.30 లక్షలు వెచ్చించి జై శ్రీమన్నారాయణ నిలయాన్ని నిర్మించారు. రూ.6 లక్షల వ్యయంతో వంటశాల, తాగునీటి సౌకర్యార్థం 1.20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మించారు. రూ.25 వేలతో శాశ్వత అన్న దాన సభ్యత్వం తీసుకున్నవారు 100 మందికి పైగా ఉన్నారు. దాతలు ఇచ్చే రూ.11 వేలతో ప్రతి శనివారం అన్నదానం నిర్వహిస్తున్నారు. తిమ్మాపూర్ కు చెందిన కొంత మంది యువకులు రూ. 3 లక్షలతో 42 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని వెంకన్న కొండపై నెలకొల్పారు. దాతల సహకారంతో రూ.20 లక్షలతో అలిపిరి ఘాట్ నిర్మించారు. ఆలయ ముఖ ద్వారాన గరుత్మంతుని విగ్రహం మరింత ఆకర్షణ. దీనితో పాటూ మరో రూ.20 లక్షలతో ముఖ ద్వారాలు నిర్మించారు. ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
తిరుమలను తలపించే ఆలయం
సీఎం కేసీఆర్ విడుదల చేసిన రూ. 23 కోట్లతో ప్రాకారం, మాడవీధులు, రాజగోపురాలు గాలిగోపురాలు, యాగశాల, స్వామివారి కల్యాణ మండపం, చక్ర స్నానం కోనేరు, కల్యాణ కట్ట, పాకశాల, భక్తుల అతిథి గృహం, వంటశాల, వివాహాలు చేసుకోవడానికి కల్యాణ మండపం, భోజనశాల నిర్మించారు. రూ.5 కోట్లతో మినీ ట్యాంకు బండ్ నిర్మించారు. బోటు ఏర్పాటు చేశారు. తిరుపతి వెళ్లటానికి స్తోమత లేని భక్తులు ఇక్కడ వెంకన్న స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్లినంత పుణ్యమని భక్తుల నమ్మకం. అచ్చు తిరుమల శ్రీవానిరి దర్శించుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. రెండు కొండల నడుమ స్వామివారు వెలియటంతో తిరుమల గిరి చేరినంత ఆనందంగా ఉంటుందంటారు భక్తులు. ఈ కొండపై ప్రకృతి సోయగం భక్తులను కట్టిపడేస్తుంది.
Alsdo Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి