Prashant Kishor Survey: నిజంగా పీకే సర్వేలు లీకయ్యాయా ? సోషల్ మీడియాలో వైరల్ రిపోర్టుల్లో నిజమెంత !
PK Survey On TRS Leaders : టీఆర్‌ఎస్ పార్టీ ఐ పాక్‌తో ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సర్వే రిపోర్టులు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
PK Survey On TRS Leaders : ప్రశాంత్ కిషోర్.. ఈ పేరు పొలిటికల్ సర్కిల్స్‌లో నానుతున్న పేరు. రాజకీయ వ్యూహకర్తగా, తనదైన శైలిలో స్థానిక రాజకీయాలను మారుస్తూ ఐ పాక్‌తో రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తి ఆయన. అయితే ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్ పార్టీ ఐ పాక్ (Indian Political Action Committee)తో ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సర్వేలు, సోషల్ మీడియా కేంద్రంగా పీకే చేసే చాణక్యత ఇప్పుడు తెలంగాణలోని సోషల్ మీడియాను సర్వేల పేరుతో ఓ ఊపు ఊపేస్తున్నారు.. అయితే ఇంతకీ అవి నిజంగా పీకే సర్వేలేనా..? అంత పటిష్టంగా ఉండే పీకే సర్వేలు ఎలా లీకయ్యాయి అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
లోకల్ గ్రూప్స్‌లో హడావుడి..
ప్రశాంత్ కిషోర్ సర్వేల పేరుతో ఇటీవల లోకల్ గ్రూప్స్‌లో పొలిటికల్ చర్చ సాగుతుంది. నియోజకవర్గాల వారీగా ఏ అభ్యర్థులు గెలుస్తారు..? ఎవరికి వచ్చే ఎన్నికల్లో సీటు పక్కా అవుతుందనే విషయంపై చర్చ సాగుతుంది. ఎవరికి వారు తమ అభిమాన నాయకుడికి అత్యధిక మార్కులు వచ్చాయనే విదంగా మార్పింగ్‌లు చేసిన పోస్టింగ్‌లతో సోషల్ మీడియాను ఉదరగొడుతున్నారు. అయితే వాస్తవ నేపథ్యంలో పీకే స్ట్రాటర్జీ వర్కవుట్ అయ్యేదాక ఎవరికి అంతు చిక్కదు. అయితే ఎన్నికలు ఏడాది కాలం ముందుగానే ఇలా పీకే పేరుతో ఐ ప్యాక్ (IPAC) సర్వేలంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
నిజంగా పీకే సర్వేలేనా..?
వాస్తవానికి పీకే సర్వేలు క్షేత్రస్థాయితో ముడిపడి ఉంటాయి. సామాజిక వర్గాలు, రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజల మనోబావాలతోపాటు ఆయా ప్రాంతంలో ఎక్కువగా ప్రబావితం చేసే అంశాలపై సర్వేలు జరుపుతుంటారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా పీకే టీమ్ సర్వే (PK Survey On TRS Leaders) చేసిన దాఖలాలు కనిపించలేదు. ఎందుకంటే ఎవరైనా సర్వే నిర్వహిస్తే ఎవరికో ఒకరికి అనుమానం వచ్చి ఆ విషయం కాస్తా ఆ ప్రాంతంలో ప్రచారం సాగుతుంది. అయితే ఐ పాక్ టీమ్ సర్వే చేసిన దాఖలాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో కేవలం ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు, అక్కడున్న పరిస్థితులపై ఒక అవగాహనకు వచ్చినట్లు మాత్రమే తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఈ పోస్టింగ్‌ల విషయం మాత్రం పీకే స్ట్రాటర్జా.. లేక లోకల్ స్ట్రాటర్జా అనే విషయం సోషల్ మీడియా పాఠకులకు మాత్రం అంతుపట్టడం లేదు.
పీకే వ్యూహంలో భాగమేనా..?
ప్రశాంత్ కిషోర్ ఐ పాక్ టీమ్ అంటే ఓ బ్రాండ్‌గా మారిపోయింది. పీకే టీమ్ దిగితే ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడే అన్నట్లుగా అంచనాలు మారిపోతున్నాయి. యూపీలో కాంగ్రెస్ పార్టీతో మినహా గతంలో ఆయన పనిచేసిన రాష్ట్రాల్లో పలు పార్టీలకు విజయాలు అందించారు. ఈ నేపథ్యంలో తన బ్రాండ్‌నే ఇప్పుడు పబ్లిసిటీ ద్వారా ప్రచారం చేసుకుని దాని ద్వారా టీఆర్‌ఎస్ (TRS)కు లాభం చేకూర్చాలనే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ సోషల్ మీడియా చక్కర్లు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. లేకపోతే నిజంగానే సర్వే చేసి అక్కడున్న ప్రజల మైండ్ సెట్‌ను మార్చేందుకు సర్వేలను పీకే టీమ్ లీక్ చేసిందా..? అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఏది ఏమైనా పీకే సర్వేల పేరుతో సోషల్ మీడియాను చుట్టేస్తున్న చక్కర్లు నాయకులకు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి.