Tragedy at Ganesh Immersion 2025: గణేష్ నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి, మరోచోట తండ్రీకొడుకులు మృతి
Ganesh Nimajjanam 2025 | వినాయక నిమజ్జనాల్లో పలుచోట్ల విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో అప్పటివరకూ డ్యాన్స్ చేసిన ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందాడు.

Tragedy at Ganesh Visarjan 2025 | నారాయణపేట: తెలంగాణలో వినాయకుడి శోభాయాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. నారాయణపేట పురపాలికలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శేఖర్ (45) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో శేఖర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరిస్థితి గమనించిన స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు వెంటనే సీపీఆర్ చేసి, స్థానికుల సహాయంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శేఖర్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శేఖర్‌కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటివరకూ ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన శేఖర్ చనిపోవడంతో సహచర ఉద్యోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గణేశ్ నిమజ్జనం- తండ్రి, కుమారుడు సాగర్ కాల్వలో గల్లంతు
వేములపల్లి: గణేశ్ నిమజ్జనం సందర్భంగా తండ్రి, కుమారుడు సాగర్ ఎడమ కాల్వలో గల్లంతైన ఘటన శుక్రవారం వేములపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన స్థానికులను విషాదంలో ముంచింది. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన పున్న సాంబయ్య (50) వంటమనిషిగా పని చేస్తుండగా, కుమారుడు శివమణి (20) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ తమ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సాగర్ ఎడమ కాల్వ వద్దకు వెళ్లారు.
నిమజ్జనం అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా, సాంబయ్య కాల్వ దగ్గర కాళ్లు కడుక్కోవడానికి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. తండ్రిని కాపాడేందుకు శివమణి తన గుడ్డెను అందించగా, ఆ క్రమంలో అతడూ లాగబడిపోయి కాల్వలో పడిపోయాడు. అక్కడే ఉన్న వారంతా వీరిద్దరిని రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరి ఆచూకీ గల్లంతయింది. పోలీసులు రెస్క్యూ టీం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాంబయ్య అన్న కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ఏపీలో ఒకేరోజు ఆరుగురు మృతి
ఇటీవల వినాయక శోభాయాత్రలో పాల్గొన్న సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఏపీలో ఒకేరోజు ఆరుగురు భక్తులు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లలో ఇటీవల విషాదం చోటు చేసుకుంది. గణేశ్ శోభాయాత్ర చేస్తుండగా ఓ ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి భక్తులపైకి దూసుకురావడంతో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో గణేష్ శోభాయాత్ర జరుగుతుండగా స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.






















