Revanth Reddy at Hussain Sagar: గణేష్ నిమజ్జనాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు వెళ్లి సిబ్బందిని అభినందించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం వేడుక సందర్భంగా ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకిచ్చారు. ఆయన హుస్సేన్ సాగర్ వద్దకు గణేష్ విగ్రహాల నిమజ్జనాలను స్వయంగా పరిశీలించారు. గణేష్ శోభాయాత్రలు, నిమజ్జనం వేడుకల్లో వేలాదిగా తరలివచ్చి పాల్గొంటున్న భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేసి వారిలో ఉత్సహాన్ని నింపారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి గణేష్ నిమజ్జన వేడుకల్ని స్వయంగా పరిశీలించడానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి భక్తులతో కలిసి నినాదాలు చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ముందస్తు సమాచారం లేకుండా సాధారణ భక్తుడిలాగ సీఎం రేవంత్‌రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యక్షం కావడంతో నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. ట్యాంక్ బండ్ వద్ద క్రేన్ నెం.4వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రతిష్టాత్మక గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

నిమజ్జనాల సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. గణేశ్ నిమజ్జనాలు జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించడంపై భాగ్యనగర్ ఉత్సవ్ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనోత్సవం
హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనోత్సవం శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని బాహుబలి క్రేన్ పాయింట్4 వద్ద నిమజ్జనాన్ని శోభాయమానంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు "గణపతి బప్పా మోరియా" నినాదాలతో నినదిస్తూ మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులు, సిబ్బందిని సీఎం రేవంత్ అభినందించారు.
నిమజ్జనానికి ముందు, భాగ్యనగర్ ఉత్సవ సమితి నిర్వాహకులు గణేషుడికి తుది పూజలు నిర్వహించి, సంప్రదాయరీతిలో నిమజ్జనానికి సిద్దం చేశారు. కాగా, శనివారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. రూట్ మ్యాప్ ఇచ్చినట్లుగానే రాజ్‌దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర చేరుకుంది. భక్తుల రద్దీతో కూడిన ఈ యాత్రకు అనుగుణంగా, పోలీసు విభాగం ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు మార్గమంతా కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.






















