Tomato Price: హైదరాబాద్‌లో తగ్గిన టమాటా ధరలు, నగరవాసులకు ఊరట
గతంలో పంటలు భారీగా నష్టపోవడంతో హైదరాబాద్‌లో టమాటా ధరలు భారీగా పెరిగాయి.
దేశవ్యాప్తంగా టమాట ధరలు ప్రజలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఎక్కడ విన్న టమాట ధర భగభగల గురించే వినిపించేది. ఎక్కడ చూసిన టమాటా చర్చలే. గతంలో ఎన్నడూ లేనంతగా కేజీ టమాట ధర 200, కొన్ని రాష్ట్రాల్లో 250 చేరి సామాన్యుల గుండెల్లో దడ పుట్టించింది.
టమాట ధర పెరిగిపోవడంతో టమాటా దొంగతనాలు, పంటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తింది. అయితే ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి అవ్వగా మరికొందరు కోటీశ్వరులు అయ్యారు. అయితే దాదాపు రెండు నెలలుగా కొండేక్కి కూర్చున్న టమాట ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పెరిగిన టమోటా ధరలు ప్రస్తుతం హైదరాబాద్‌లో తగ్గాయి.
గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన్న సంగతి తెలిసిందే. కిలో రూ.200 వరకు పెరిగిన ధరలు... క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో తాజాగా రూ.60 నుండి 70కి రూపాయలకు పడిపోయాయి. నిన్న రిటైల్ మార్కెట్‌లో ధరలు మరింత దిగజారగా కిలో రూ.50 నుండి 60కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లోని మార్కెట్ కు టమాట పోటెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది.
నగర ప్రజలు టమాటలను కొనకుండా ఇతర కూరగాయలను కొనడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి.
అంతకుముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలలో వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో నగరంలో టమాట ధరలు పెరిగాయి. అక్కడ నుండి విక్రేతలు వాటిని దిగుమతి చేసుకున్నారు.
ధరల పెరుగుదల కారణంగా అనేక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా వంట లో పల్పీ పండ్ల వాడకాన్ని తగ్గించడం ప్రారంభించాయి. ఇప్పుడు టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో అమ్మకాలు పెరగడంతోపాటు రెస్టారెంట్లు, హోటళ్లు లో వంటలో టమాటా వాడకం సాధారణ స్థితికి చేరుకుంది. పది రోజుల క్రితం హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్ కు 850 క్వింటాళ్ల టమాటా రాగా.. సోమవారానికి ఏకంగా 2400 క్వింటాళ్ల టమాటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్ కు టమాటలు వస్తున్నాయి.
గతంలో ఒక్క 23 కేజీల బాక్స్ ధర 4300 పలికేది. కానీ రోజురోజుకీ ధరలు తగ్గిపోవడంతో ప్రస్తుతం 23 కేజీల బాక్స్ ధర 2300 కు తగ్గింది. అంటే టమాటా నాణ్యతను బట్టి బాక్సు ధర పలుకుతుంది. టమాటాలు అమ్మి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన రైతులు ప్రస్తుతం మార్కెట్లో ధర పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు.
వర్షాలు పడితే ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు టమాటకు బదులు వేరే కూరగాయల వైపు దృష్టి సారించడంతో కొంతమేర కూడా డిమాండ్ పడిపోయింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలోని ప్రాంత ప్రజలకు టమాట ధరలు తగ్గడంతో కొంతమేర ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా డిమాండ్ పెరిగి మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.