TS High Court: పోడు భూములపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు, అసలు ఏంటి ఈ వ్యవహారం?
ప్రతి వాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోడు భూముల వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేస్తున్న రైతులకు పట్టాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను దాదాపు 73 మంది పోడు భూములు సాగు చేసుకొనే రైతులు దాఖలు చేశారు. పోడు భూముల్లో ఉన్న రైతులను బలవంతంగా ఖాళీగా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషనర్స్ తరపున హైకోర్టు న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులను పిటిషనర్లు ప్రతి వాదులుగా చేర్చారు. ఈ పిటీషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రతి వాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
పోడు భూములు అంటే..
అడవుల్లో, కొండ వాలుల్లో ఉండే చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి భూమిని చదును చేసుకొని చేసే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని పిలుస్తారు. ఆదివాసీలు సాంప్రదాయంగా చేసుకునే ఇలాంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకొనే వారిని గుర్తించి సబ్‌డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలకు పంపాల్సి ఉంది. ఈ కమిటీల్లో నిర్ణయించిన విధంగా పట్టాలు జారీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు ఇచ్చే విషయంలో అటవీ శాఖ అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నట్లుగా ప్రస్తుతం ఆరోపణలు ఉన్నాయి.
Also Read : సుబ్బరామిరెడ్డి కంపెనీకి భారీ టోకరా.. నిందితులు అరెస్టు, అసలేం జరిగిందంటే..
పోడు భూములపై గొడవ ఎందుకు?
అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూముల హక్కులను గిరిజనులకు అధికార యంత్రాంగం కల్పించాలి. అయితే, అది చేయకపోగా హరితహారం పేరుతో భూములను స్వాధీనం చేసుకొని మొక్కలు నాటుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొందరు అటవీ అధికారులు ఆదివాసీల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలు తెలంగాణలో వెలుగు చూశాయి. అక్రమ కేసులు పెట్టడం, అటవీ అధికారులు పోడు ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు గిరిజన గ్రామాల వారు నిర్భందించడం, వారిపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు గతంలో వెలుగు చూశాయి. అయితే, పోడు భూముల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంకా అధికారిక ఉత్తర్వులు, కొత్త మార్గదర్శకాలు కానీ విడుదల కాకపోవడంపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం తదనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగు కూడా పులుముకుంది.
Also Read: KTR: ఈ స్కూల్ చూసి ఆశ్చర్యపోయిన కేటీఆర్.. ఇలాంటివే రాష్ట్రంలో మరిన్ని.. కేటీఆర్ వెల్లడి
Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?