Disha Case Updates: దిశ ఎన్‌కౌంటర్ ఘటనలో పోలీసులకు భారీ ఊరట, హైకోర్టు కీలక తీర్పు
Telangana High Court: హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులకు ఊరట లభించింది.
Hyderabad Police: 2019లో హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులకు తాజాగా భారీ ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టును ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్ తహసిల్దార్ ఆశ్రయించారు. వీళ్ళపై చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్టే విధించారు.
దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కోసం సిర్పూర్ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించింది. క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు పలువురిని సిర్పూర్ కమిషన్ విచారణ చేసింది. దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్ కమిషన్ సూచించింది. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక సరిగ్గా లేదని హైకోర్టులో పోలీసు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైకోర్టు పోలీసులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
సామూహిక అత్యాచారం, హత్య
దిశ అనే 26 ఏళ్ల పశువైద్యురాలిని నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన సంగతి తెలిసిందే. 2019 నవంబరు 28 ఉదయం దిశ శవాన్ని గుర్తించారు. షాద్ నగర్ లోని చేతనపల్లి బ్రిడ్జి సమీపంలో దహనం చేసిన శవం లభ్యం అయింది. అంతకుముందు రోజు రాత్రి ఆమె సమీపంలోని టోల్ గేట్ సమీపంలో ఒంటరిగా ఉండగా.. లారీలో వచ్చిన నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో విపరీతంగా దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. నిందితులను శిక్షించాలని ప్రజల నుంచి తీవ్రమైన డిమాండ్ లు తెరపైకి వచ్చాయి.
అనంతరం విచారణలో భాగంగా సైబరాబాద్ పోలీసులు నిందితులతో సీన్ రీక్రియేట్ చేస్తుండగా.. నలుగురు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై దాడి చేసి పారిపోయే క్రమంలో వారిని ఎన్ కౌంటర్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ ఘటనపై మానవహక్కుల పోరాటదారులు నిరసనలు వ్యక్తం చేశారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని.. పోలీసులు చట్టాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శలు వచ్చాయి.