Telangana High Court: హైదరాబాద్‌లో కుక్కల దాడి అందుకే, వాటిని నిర్మూలించాల్సిందే - హైకోర్టు
Dog Bites in Hyderabad: కుక్కల స్టెరిలైజేషన్ కేంద్రాల వద్ద రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని ఏజీ కోర్టుకు తెలపగా.. దానిద్వారా కుక్కల దాడి ఘటనలను ఎలా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించింది.
Hyderabad News: హైదరాబాద్ లో ఇటీవల కుక్కల దాడి ఘటనలు పెరిగినందుకు దానిపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు (జూలై 18) విచారణ జరిగింది. ఇటీవలే జవహార్ నగర్ లో కుక్కల దాడిలో మృతి ఏడాదిన్నర బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో తెలపాలని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపగా.. ఆ స్టెరిలైజేషన్ ద్వారా కుక్కల దాడి ఘటనలను ఎలా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించింది.
రెండు వారాలకు వాయిదా
ఆ కుక్కలను షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది సూచించారు. ఇలాగే నాగపూర్ లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్ లో పెట్టినట్టు హైకోర్టుకు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటికల్లా కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు మరిన్ని పరిష్కార మార్గాలతో రావాలని సూచించింది.
చెత్త వల్లే కుక్కల సంచారం
అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉంటే వాటన్నింటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం ఎలా సాధ్యం అని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు రహదారులపై చెత్త, వ్యర్థాలు బాగా ఉండడం వల్లే రూడ్లపై కుక్కలు ఎడాపెడా తిరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఆ చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది.