పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన గవర్నర్ - సుప్రీం విచారణ వేళ కీలక నిర్ణయం
గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. పెండింగ్ బిల్లుపై ప్రభుత్వ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళిసై.
గవర్నర్ తమిళిసై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తన వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లుల్లో ఒకటి తిరస్కరించారు. మరో రెండింటిని మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి తిరిగి పంపించారు.
గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పాలనకు ఇబ్బందిగా మారుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇప్పటికే ఓసారి విచారణకు వచ్చింది. ఇవాళ మరోసారి విచారణకు రానుంది. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న పెండింగ్ బిల్స్‌ను క్లియర్ చేశారు గవర్నర్.
అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్లో మూడింటిని ఆమోదించినట్టు రెండింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు మొన్నటి విచారణకు సుప్రీంకోర్టుకు తెలిపారు. మూడే బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్టు రాజ్‌భవన్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు.
ఇవాళ విచారణ జరగనున్న వేళ ఆ మూడింటినీ క్లియర్ చేశారు. అందులో డీఎంఈ సహా వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టుల రిటైర్‌మెంట్ ఏజ్ పెంపును ఉద్దేశించిన బిల్లును తిరస్కరించారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడింగిపు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపును ఉద్దేశించిన బిల్లు, కొత్తగా మరిన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్టసవరణ బిల్లుపై వివరణ కోరారు.
మంత్రులు సీరియస్
ఈ మద్య పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై తెలంగాణ మంత్రులు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కోర్టుల్లో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ అవ్వని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. మంత్రులు కలిసినా గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను 7 నెలలుగా గవర్నర్ ఆపారని హరీష్ గుర్తు చేశారు. రాజ్ భవన్ రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసన్నారు. ఎన్ని కుట్రలు చేసైనా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలనే బీజేపీ వైఖరి తేటతెల్లమైందని అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని ప్రశ్నించారు.
కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, 7 నెలలు అపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారని అన్నారు. మా పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అని హరీష్ రావు ప్రశ్నించారు. అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 1961 నుంచే ఉన్నది. మరి అలాంటప్పుడు గవర్నర్ ఇలా వ్యవహరించడం సబబేనా అని ప్రశ్నించారు. హస్తిన నుంచి ఆదేశాలు రావడం.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం.. గవర్నర్ చేసే ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని హరీష్ అన్నారు. సరైన సమయంలో కేంద్రానికి తెలంగాణ సమాజం గుణపాఠం చెబుతుందన్నారు. స్వతంత్ర సంస్థలను పని చేయనీయకుండా చేయడం సమంజసం కాదని హితవు పలికారు.