ఈటల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఆరా, ఎమ్మెల్యే ఇంటికెళ్లిన సీనియర్ ఐపీఎస్ అధికారి
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఈటల భద్రతపై రివ్యూ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
భద్రతకు ముప్పు ఉందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఈటల అంటే.. తన భర్తను చంపే కుట్ర జరుగుతోందన్నారు. దీని కోసం సుపారీ కూడా ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ కేంద్రంగానే వాళ్లీ ఆరోపణలు చేశారు.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఈటల భద్రతపై రివ్యూ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వెంటనే కలుగుజేసుకున్న డీజీపీ... మేడ్చల్ డీసీపీ సందీప్‌రావుకు స్పెషల్ టాస్క్ ఇచ్చారు.
డీజీపీ ఆదేశాల మేరకు స్పందించిన సందీప్‌రావు ఈటల రాజేందర్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఈటల బయటకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన తిరిగి వచ్చేశారు. ఈటల వచ్చిన తర్వాత మరోసారి వెళ్లి ఆయనతో మాట్లాడనన్నారు. వివరాలు తీసుకొని డీజీపీకి రిపోర్ట్ చేయనున్నారు.
మంగళవారం ఈటల రాజేందర్ సతీమణి జమున హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ కౌశిక్ రెడ్డి అన్నట్లు తమకు తెలిపిందని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారని ఆరోపించారు. తమ కుటుంబసభ్యులకు ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా దానికి సీఎం కేసీఆర్‌దే బాధ్యతని అన్నారు.
కౌశిక్ రెడ్డి లాంటి ఓ పిచ్చికుక్కను ఎమ్మెల్సీని చేసి సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రజల మీదకు వదిలారని ఘాటుగా వ్యాఖ్యానించారు జమున. పిచ్చికుక్క అరాచకాలు పెరిగిపోయాయని, నియోజకవర్గ ప్రజలు, మహిళల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన ఈటల కొన్ని నెలలుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేవాడిని కానన్నారు. నయీమ్ కే భయపడలేదని గుర్తు చేశారు. ఈ బెదిరింపులకు భయపడతానా అని ప్రశ్నించారు. తనతో పెట్టుకుంటే మాడిమసైపోతారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల హెచ్చరించారు.