Revanth Reddy: ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుంటాడు - యూట్యూబ్ ఛానెళ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Comments: యూట్యూబ్ ఛానెళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ ల వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నాయి.
Telangana Cm Revanth Reddy comments on youtube channels and journalists | "విపరీతం ఎట్లైపోయిందంటే.. అసలు కంటే కొసరోళ్లది ఎక్కువైపోయింది. ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు. ఇలాంటి ట్యూబులోళ్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోయి ఏదిపడితే అది మాట్లాడితే.. అక్కడున్న ప్రజలు ఏమన్నా అంటే.. చూశారా జర్నలిస్ట్ లపై దాడి అంటున్నారు. జర్నలిస్ట్ లు అనే పదానికి డెఫ్నిషన్ ఏంటో మీరు డిసైడ్ చేయండి. మేమెవర్ని జర్నలిస్ట్ లు గా చూడాలో మీరు చెప్పండి. ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుని, ఆ ట్యూబ్ లో పెట్టుకుని, మెడలో పట్టీ వేసుకుని, నేను ఓ ట్యూబ్, ఓట్యూబ్ లో జర్నలిస్ట్ ని అని బయలుదేరితే, వారు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు, ఏది పడితే అది, మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమైనా అంటే.. చూశారా జర్నలిస్ట్ ల మీద దాడి అంటారు.." అంటూ యూట్యూబ్ ఛానెళ్లు, ఆ ఛానెళ్లలో ఉండే జర్నలిస్ట్ లపై హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి సంబంధించి అర్హులకు భూమి పత్రాలు పంపిణీ చేశారాయన. ఈ సందర్భంగా కొంతమంది చేసే పనులతో జర్నలిస్ట్ లందరికీ చెడ్డపేరు వస్తుందని అన్నారు. జర్నలిస్ట్ లు అనే పదానికి ఉన్న అర్థాన్ని కొందరు మార్చేస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఎందుకీ ప్రస్తావన..?
ఆమధ్య తెలుగు స్క్రైబ్ అనే యూట్యూబ్ ఛానెల్ కి సంబంధించిన ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కి వెళ్లారు. అక్కడ రైతు రుణమాఫీ ఎలా జరిగింది అనే విషయంపై స్థానికుల ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. కెమెరాల్లోని మెమరీ కార్డ్ లు తీసుకోవడం, సెల్ ఫోన్లు లాక్కోవడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారంటూ జర్నలిస్ట్ లు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పరోక్షంగా ఈ గొడవపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ ట్యూబ్ లు, ఈ ట్యూబ్ లంటూ.. యూట్యూబ్ ఛానెళ్లపై సెటైర్లు పేల్చారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ ల వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానెళ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలంటూ వీడియోని ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ ఛానెళ్లు ఎక్కువైపోవడం, ఎవరికి వారే కొత్త ఛానెల్ పెట్టుకుని, వాటికి ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా చెలామణి కావడం, ఐడీ కార్డ్ లు ప్రింట్ చేయించుకోవడంతో అసలు జర్నలిస్ట్ లు ఎవరో తెలియడం లేదనే వాదన ఉంది. ఏ నియోజకవర్గ కేంద్రంలో అయినా ప్రెస్ మీట్ అంటే దాదాపు 50కి పైగా లోగోలు కనపడతాయి. వీరిలో ఎంతమంది నిజమైన జర్నలిస్ట్ లు..? చదువు లేకపోయినా, రాయడం రాకపోయినా ఎంతమంది ఐడీకార్డ్ లు మెడలో వేసుకుని కనపడుతున్నారనే వాదన వినపడుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ లు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు.
Also Read: ఒవైసి కాలేజీ ఎప్పుడు కూల్చుతారు? రేవంత్ రెడ్డి భయపడ్డారా ! లేక రాజీపడ్డారా?: రాజాసింగ్ సంచలనం
యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేకపోయినా ఆ పేరుతో ఎవరికి వారే ఛానెల్ పెట్టుకోవడం, తమకి నచ్చినట్టుగా వార్తలివ్వడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కి అనుకూలంగా కూడా తెలంగాణలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఇలాగే జర్నలిస్ట్ గా పాపులర్ అయిన తర్వాత ఏకంగా ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అనుకూల యూట్యూబ్ ఛానెళ్లను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం కామెంట్ చేస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. రేవంత్ రెడ్డి మాటలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతున్నాయి.
Also Read: వానలు ఆగాలని చిలుకూరు బాలాజీకి భక్తుల ప్రదక్షిణలు, అర్చకుల ప్రత్యేక పూజలు