Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం - బీఆర్ఎస్ లాగా హామీలు ఇచ్చి మోసం చేయం: శ్రీధర్ బాబు
Sridhar Babu: మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీలాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయముంటూ తెలిపారు.
Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఆరు హామీలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు.. కాంగ్రెస్ పార్టీ అస్సలే హామీలు నెరవేర్చదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే అవకాశమే లేదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. మీలాగా మేము హామీలు ఇచ్చి.. వాటిని తీర్చకుండా ప్రజలను మోసం చేయమని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అని.. కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా వెంటనే అమలు చేసి తీరుతుందని చెప్పారు. గురువారం రోజు గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకొని మరీ.. అలాంటి హామీలు ఇచ్చామని చెప్పారు. అలాగే త్వరలోనే అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించి.. స్థానిక మేనిఫెస్టోలు కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. సీఎం కేసీఆర్ మెగా డీఎస్పీ పెట్టాలని సూచించారు. అలాగే 13 వేల 500 చీటర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదే అయితే.. మెగా డీఎస్పీ ఏర్పాటు చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని సవాల్ విసిరారు. వీళ్లు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.
కాంగ్రెస్ హామీలపై మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే?
కాంగ్రెస్ నాయకులంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత తెలంగాణకు వచ్చి మాట్లాడాలంటూ సూచించారు. కాంగ్రెస్ గెలిస్తే 6 నెలలకు ఓ సీఎం మారతారంటూ సెటైర్లు వేశారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం శంకరంపేటలో వంద డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మొత్తం 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ... పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసి, ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లు, ప్లాట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే కచ్చితంగా చేస్తాడని చెప్పుకొచ్చారు. నారాయణ్ ఖేడ్ లో ఇచ్చిన హామీ మేరకు... అన్నీ చేసి చూపించాడన్నారు. అలాగే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
కాంగ్రెస్ వాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రస్తుతం 600 రూపాయల పింఛన్ ఇస్తున్నారని.. విద్యుత్తు అంతరాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వికలాంగులకు 1000, రైతు బంధువులకు 10 వేలు ఇస్తున్నామని కాంగ్రెస్ చెబుతున్నదంతా అవాస్తవం అని పేర్కొన్నారు. అధికారంలోకి రావాలని తెలంగాణలో నోటికి వచ్చి హామీలు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరానికి నీళ్లు ఇస్తాం, శంకరంపేటలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తాం అని వివరించారు.