Sigachi Industries: పేలుడు తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఖ్యాతికి మచ్చ.. MCC ఉత్పత్తిలో అగ్రగామి కంపెనీకి ఏమైంది?
Sigachi Industries: సిగాచి తొలి యూనిట్ 1990లో సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ప్రధానంగా MCCనే ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ నుంచి అధికంగా MCCని ఉత్పత్తి చేస్తుంది.

Sigachi Industries: సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అంతర్జాతీయంగా పేరున్న ఒక రసాయన పరిశ్రమ. ఇటీవల పాశమైలారంలోని తమ యూనిట్‌లో జరిగిన పేలుడు, పెద్ద సంఖ్యలో కార్మికుల మరణాలకు దారితీయడంతో ఈ కంపెనీ పేరు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీ. కానీ అతి పెద్ద ప్రమాదం జరగడం కారణంగా ఇప్పుడు ఆ కంపెనీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ ఏం ఉత్పత్తి చేస్తుంది, కంపెనీ పూర్వపరాలేంటో తెలుసుకుందాం.
సిగాచి ఇండస్ట్రీస్ ప్రారంభం, విస్తరణ
సిగాచి క్లోరో కెమికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ 1989, జనవరి 11వ తేదీన ప్రారంభమైంది. తొలి నాళ్లలో కోరినేటెడ్ పారాఫిన్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడంతో ఈ పరిశ్రమ ప్రారంభమైంది. 1995లో సిగాచి క్లోరో కెమికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC) ఉత్పత్తిని చేయడం ప్రారంభించింది. ఇది ఆ కంపెనీ సరికొత్త దిశగా అడుగులు వేసేందుకు కారణమైంది. 1998 నాటికి MCC ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే దిశగా ఎదిగింది. MCC అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ కంపెనీ 2012లో సిగాచి ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారి ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ అయింది. ఇలా సిగాచి ఇండస్ట్రీస్ త్వరితగతిన అభివృద్ధి చెందింది.
సిగాచి ఇండస్ట్రీస్ యూనిట్లు
సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సిగాచికి తెలంగాణలోని పాశమైలారం, సుల్తాన్‌పూర్‌లలో యూనిట్లు ఉన్నాయి. గుజరాత్‌లో ఝగడియా, దాహెజ్‌లలో, కర్ణాటకలోని రాయచూర్‌లో అత్యాధునిక ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. సిగాచి తొలి యూనిట్లలో ఒకటి పాశమైలారం యూనిట్. దీన్ని 1990లో సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ప్రధానంగా MCCనే ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ నుంచే అధికంగా MCCని ఉత్పత్తి చేస్తుంది, ఈ యూనిట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఇప్పుడు మూతపడే పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో రబీంద్ర ప్రసాద్ సిన్హా (ఛైర్మన్), చిదంబరనాథన్ షణ్ముగనాథన్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్), అమిత్ రాజ్ సిన్హా (మేనేజింగ్ డైరెక్టర్ & CEO) గా ఉన్నారు.
సిగాచి కంపెనీ నుంచి వెలువడే ఉత్పత్తులు
సిగాచి ఇండస్ట్రీస్ ముఖ్యంగా **మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC)**ను ఉత్పత్తి చేసే సంస్థ. ఇది మొక్కల ఫైబర్ నుంచి వచ్చే ఉత్పత్తిని శుద్ధి చేసి తెల్లటి పదార్థంగా మారుస్తుంది. దీనిని ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు తయారు చేసే ఔషధాల్లో, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. టాబ్లెట్‌ను తయారుచేసే పదార్థాలన్నీ కలిపినప్పుడు అవి కలిసి గట్టిగా ఉండేలా MCC పొడి వాటిని కలిపి గట్టిగా ఉండే పదార్థంగా ఉపయోగిస్తారు.
ఈ మందు గుళికల్లో అవసరమైన ఔషధం కేవలం అతి చిన్న పరిమాణంలో ఉంటుంది. దాని పరిమాణం తగినంత పెంచాలంటే అలాంటి టాబ్లెట్స్‌లో దీన్ని ఫిల్లర్‌గా, అంటే పరిమాణం పెంచే పదార్థంగా వాడతారు. ఇక టాబ్లెట్స్ మనం వేసుకున్నాక మన కడుపులో అవి కరిగిపోతాయి. ఇందుకోసం MCC ఉత్పత్తిని డిజింటిగ్రెంట్‌గాను వినియోగిస్తారు. ఇక మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది సురక్షితమైన పదార్థం. దీన్ని ఆహార ఉత్పతుల్లో థిక్కెనర్‌గా, స్టెబిలైజర్‌గా, ఎమల్సిఫైయర్‌గా వినియోగిస్తారు. అంతేకాకుండా సౌందర్య సాధనాల్లో క్రీములు, పౌడర్లలో టెక్చరైజర్‌గా వినియోగిస్తారు. ఇలా ఈ MCC చాలా డిమాండ్ ఉన్న ఉత్పత్తిగా చెప్పవచ్చు.
సిగాచి ప్రత్యేకతలు
సిగాచి ఇండస్ట్రీస్ MCC ఉత్పత్తి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులు చేసే అగ్రగామి కంపెనీలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ MCC ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. వంద కంటే ఎక్కువ గ్రేడ్ కలిగిన MCCని ఉత్పత్తి చేస్తూ ఆయా పరిశ్రమల అవసరాలను తీర్చే స్థాయిలో నిలిచింది. ఇక సంస్థ ఉత్పత్తులు EXCiPACT GMP, cGMP, HACCP, EDQM CEP, ISO 9001:2015 వంటి కఠినమైన అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకున్నట్లు సర్టిఫై చేస్తున్నాయి. అంటే నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఇండస్ట్రీగా సిగాచికి అంతర్జాతీయంగా పేరు గడించింది.
అగ్ని ప్రమాదం, ప్రాణనష్టంతో మసకబారిన సిగాచి ప్రతిష్ట
అంతర్జాతీయంగా పేరు పొందిన సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం, భారీ ప్రాణ నష్టానికి కారణం అయింది. ఈ ప్రమాదం ఆ కంపెనీ పేరును మసకబార్చింది. ఆర్థిక నష్టాలతో పాటు, ఈ ప్రమాదం న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. యాజమాన్యం కేవలం లాభ నష్టాలు కాకుండా, పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రత కోణంలో ఆలోచించాల్సిన విషయాన్ని ఈ సిగాచి ఇండస్ట్రీస్ ఉదంతం తెలియజేస్తోంది. భద్రతకు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్‌ను పాటించడం, సరైన యంత్ర పరికరాలు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, మరమ్మతులు, పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను పాశమైలారం యూనిట్‌లో జరిగిన ప్రమాదం, ప్రాణనష్టం నొక్కి చెబుతోంది.






















