Sigachi Tragedy: సిగాచి పేలుడుతో ఏపీలో తీవ్ర విషాదం, ఓ యువతి సహా నవ దంపతులు దుర్మరణం
సంగారెడ్డిలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన ఏపీలోనూ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జమ్మలమడుగుకు చెందిన నవ దంపతులు, మరో యువతి మృతిచెందారు.

Sigachi Chemicals Blast | కడప: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ప్రమాదం ఏపీలోనూ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 36 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో అధికంగా బిహార్, ఒడిశా, యూపీతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన కార్మికులు ఉన్నారని సమాచారం. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. కొందరి మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగిస్తోంది ప్రభుత్వం.
నవ దంపతులు దుర్మరణం..
పొట్ట కూటి కోసం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించారు. ఇంకా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. జమ్మలమడుకు చెందిన నూతన దంపతులను సిగాచి కెమికల్స్ ప్రమాదం బలిగొంది. రెండు కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి, అతడి భార్య శ్రీరమ్య సిగాచి కెమికల్స్ ప్రమాదంలో చనిపోయారు. జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి దాదాపు నెల రోజుల కిందట ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన శ్రీరమయ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నూతన దంపతులు ప్రమాదం జరిగిన సమయంలో సిగాచి కంపెనీలో పనిచేస్తున్నారు.

సోమవారం రియాక్టర్ పేలడంతో షెడ్డు కూలిపోయింది. పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సైతం కూలిపోయి అందులో చిక్కుకున్న పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల తరువాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేయాలని భావించారు. కానీ అంతలోనే సిగాచి కెమికల్స్ ఈ నవ దంపతులను బలిగొంది. మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తుపుట్టలేనట్లు మారాయి. దాంతో వైద్యులు, అధికారులు డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతులను గుర్తిస్తున్నారు. మంగళవారం ఉదయం నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య మృతదేహాలను గుర్తించారు.
గోదావరి యువతి మృతి
పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన పేలుడులో తూర్పు గోదావరిలో విషాదాన్ని నింపింది. చాగల్లుకు చెందిన యువతి పోలిశెట్టి ప్రసన్న (22) మృతిచెందింది. సిగాచి కెమికల్స్ లో పేలుడు సమాచారంతో సోమవారం కుటుంబసభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని అప్పగిస్తే, తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకుంటామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
తక్షణసాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిగాచి కెమికల్స్ కంపెనీలో పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పాశమైలారం వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఘటనకు కారణాలు, సహాయక చర్యలపై అధికారులు, మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణసాయంగా రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా అవి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా సిగాచి కెమికల్స్ యాజమాన్యం నుంచి ఎవ్వరూ రాకపోవడాన్ని సీఎం తప్పుపట్టారు. సిగాచి యాజమాన్యం నుంచి మృతుల కుటుంబాలకు రూ.1 కోటి, గాయపడిన వారికి రూ. 5లక్షలు పరిహారం ఇప్పిస్తామని మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఘటనకు సంబంధించి బాధ్యుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై నిపుణులు అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు.






















