Sigachi Blast: పాశమైలారం పేలుడుకు స్ప్రే డ్రైయర్ లోపమే కారణమా? ప్రమాదం ఎలా జరిగింది? | నిపుణుల విశ్లేషణ
పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో జరిగిన పేలుడు కారణం ఆ కంపెనీలోని స్ప్రే డ్రైయిర్ లోపం కారణమని నిపుణులు చెబుతున్నారు.

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగిన పేలుడుకు ఆ కంపెనీలోని స్ప్రే డ్రైయర్ లోపమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, నిర్వహణ లోపాల వల్లే ఈ భారీ పేలుడు జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. అసలు ఈ స్ప్రే డ్రైయర్ పనితీరు ఏంటి? ప్రమాదానికి ఈ స్ప్రే డ్రైయర్ ఎలా కారణమైందో ఈ విశ్లేషణాత్మక కథనం ద్వారా తెలుసుకుందాం.
స్ప్రే డ్రైయర్‌లో అధిక ఉష్ణోగ్రతే ప్రమాదానికి కారణం
సిగాచి పరిశ్రమ ప్రధానంగా మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC)ని ఉత్పత్తి చేస్తుంది. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది శుద్ధి చేసిన తెల్లటి పొడి పదార్థం. ఇది పారిశ్రామిక అవసరాలకు, ఫార్మా రంగంలోనూ, ఆహార, సౌందర్య సాధనాలలో వినియోగిస్తారు. ఈ పదార్థం ఉత్పత్తి చేయడానికి అనేక దశలు ఉంటాయి; అందులో స్ప్రే డ్రైయింగ్ అనేది ఒక దశ.
ఈ దశలో, స్ప్రే డ్రైయర్ అనేది ద్రవ రూపంలో ఉన్న పదార్థాన్ని చిన్న అణువుల్లా మార్చి, వాటిని ఎండబెట్టేందుకు ఉపయోగించే పరికరం. ఇది వాడటం ద్వారా ద్రవ పదార్థంగా ఉన్న వాటిలోని తేమను ఆవిరిగా మార్చుతుంది. ఆ తర్వాత ఆ ద్రవ పదార్థం ఎండిపోయి, శుద్ధి చేయబడిన పొడి రూపంగా మారుతుంది. సిగాచి పరిశ్రమలో రసాయన ప్రక్రియల ద్వారా సెల్యులోజ్ ముడి పదార్థాన్ని శుద్ధి చేసి, ద్రవ స్లర్రీగా మార్చుతారు. ఈ ద్రవ పదార్థాన్ని స్ప్రే డ్రైయర్ ద్వారా పంపడం వల్ల వేడి గాలి కారణంగా మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC) పొడిగా మారుతుంది. దీన్ని ఇతర ఉత్పత్తుల్లో వాడేందుకు పంపుతారు.
బ్లో ఎయిర్ హ్యాండ్లర్ నిర్వహణ లోపమే ప్రమాద కారణం
స్ప్రే డ్రైయర్ అనేది ఒక రకమైన రియాక్టరే. ఇందులో ఉత్పత్తి అయ్యే అధిక ఉష్ణాన్ని నియంత్రించేందుకు "బ్లో ఎయిర్ హ్యాండ్లర్" (Blow Air Handler) అనే హ్యాండ్లర్ ఉంటుంది. ఈ హ్యాండ్లర్లను క్రమపద్ధతిలో తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీన్ని సరిగా శుభ్రం చేయకపోయినా, నిర్వహణ లోపాలు ఉన్నా స్ప్రే డ్రైయర్‌లో ఉష్ణోగ్రత తారాస్థాయికి చేరుతుంది. దాదాపు 700 నుండి 800 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సందర్భంలో నియంత్రించే బ్లో ఎయిర్ హ్యాండ్లర్ పనిచేయకపోవడం వల్ల పీడనం అధికమవుతుంది. అధిక ఉష్ణోగ్రత, రియాక్టర్‌లో రసాయన ఆవిరి తోడవుతుంది. సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయి ఉండవచ్చని నిపుణులు ప్రాథమికంగా వెల్లడిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరిన్ని కారణాలు బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.






















