బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్రవంతి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Ex Mla Manchireddy Kishanreddy Case : బీఆర్ఎస్ (Brs)మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి (Manchireddy Kishanreddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ (Muncipal Chairperson) ఛైర్ పర్సన్ పదవి కోసం రెండున్నర కోట్లు తీసుకున్నారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్రవంతి (Sravanthi) ఇబ్రహీంపట్నం (Ibrahimpatam) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో మంచిరెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్ పేర్లను కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మున్సిపల్ మీటింగుల్లో కనీస గౌరవం ఇవ్వకుండా, కులం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని స్రవంతి తెలిపారు. ఎక్కువ రోజులు సెలవులు పెట్టాలని, వైస్ ఛైర్మన్ కు బాధ్యతలు అప్పగించాలంటూ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన తనయుడు బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. 2019లో కలెక్టర్ గా పని చేసిన ఆమోయ్ కుమార్ సైతం తక్కువ కులం వారంటూ అవమానాలకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే ప్రతినెలా 5 లక్షలు డిమాండ్ చేసేవారు
బుడగ జంగాలు కులానికి చెందిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమె మామ కప్పరి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం గ్రామానికి సర్పంచ్‌గా పని చేశారు. తన మామ గురించి తెలుసుకున్న అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తమ ఇంటికే వచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఆఫర్ చేశారని స్రవంతి తెలిపారు. 3 కోట్లు డిమాండ్ చేయడంతో తమ వద్ద డబ్బు లేకపోయికా, తన మామ 2.5 కోట్ల రూపాయలు ఫైనాన్షియర్ల దగ్గర తెచ్చి ఇచ్చామన్నారు. ఐదేళ్లపాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టబోనని చెప్పిన మంచిరెడ్డి, చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు పేర్కొన్నారు. అనుచిత మాటలు మాట్లాడటంతో పాటు తనను మానసికంగా వేధించేవాడని, కౌన్సెలర్లు కూడా ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్‌రెడ్డితో కుమ్మక్కయ్యారని వాపోయారు. ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ భూములను కబ్జా చేశారని అన్నారు. ఎమ్మెల్యే ప్రతినెలా 5 లక్షలు డిమాండ్ చేసేవారని, అందుకు ఆమె నిరాకరించడంతో అనేక ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో తెలిపారు మున్సిపల్ ఛైర్ పర్సన్ స్రవంతి.
క్యాసినో కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న మంచిరెడ్డి
క్యాసినో వ్యవహారంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా...ఏపీ, తెలంగాణకు చెందిన ఏడుగురు రాజకీయ నేతలకు సంబంధం ఉన్నట్లు ఈడీ తేల్చింది. వారందరికీ నోటీసులు జారీ విచారించింది. ఆ జాబితాలో బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఏ యే దేశాలకు వెళ్లి క్యాసినో ఆడారు ? డబ్బు ఎలా తరలించారన్న దానిపై ఈడీ విచారణ జరపింది.