Road Accident: భార్యాభర్తల పైనుంచి దూసుకెళ్లిన లారీ - చక్రాల కింద నలిగిపోయి ఘోరం!
Rangareddy Road Accident: రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న దంపతులపైకి రావడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Rangareddy Road Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్ గూడ చౌరస్తా వద్ద ఓ లారీ పాదచారులపై దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ లారీ కింద ఇరుక్కుపోయారు. విషయం గుర్తించిన స్థానికులు మహిళను బయటకు లాగగా.. భర్త మాత్రం అందులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహిళ ప్రాణాలు దక్కినప్పటికీ.. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. తన కళ్లెదుటే నరకం అనుభవిస్తూ భర్త చనిపోయిన ఓవైపు అయితే తనకు తాకిన గాయాల తాలుకూ బాధతో కుమిలికుమిలి ఏడుస్తోంది. వెంటనే స్థానికులు పోలీసులు, 180 సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలైన మహిళను దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే ప్రమాదానికి గురైన దంపతులు కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజులగా పోలీసులు గుర్తించారు. వారు ఉపాధి నిమిత్తం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సును లారీ ఓవర్ టేక్ చేయడం వల్లే అదుపుతప్పి లారీ పాదచారుల పైకి దూసుకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
నిన్నటికి నిన్న నల్గొండలో ప్రమాదం - ముగ్గురు యువకుల దుర్మరణం
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారు ఎరసాని గూడెం వద్ద హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఖమ్మం వాసులు ఎండీ ఇద్దాక్(21), ఎస్.కే సమీర్(21), ఎస్.కే యాసీన్(18)లుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా.. వేకువ జామున ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.
నూతన సంవత్సం నాడే రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి
నూతన సంవత్సరం ప్రారంభం రోజే హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ మూడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబర్ గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పింది. వెంటనే మరో రెండు కార్లను కూడా ఢీకొట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీకొట్టగా.. వారు గాల్లోకి ఎగిరి పడ్డారు. కింద పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణం అయిన మణిపాల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం తాగి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు పెయింటింగ్ పని చేసుకుంటూ బ్రతికే శ్రీనివాస్,ఈశ్వరిలుగా పోలీసులు గుర్తించారు.