Sai Dharam Tej News: సాయి ధరమ్ తేజ్ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు
ట్రంఫ్ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బైక్‌పై సాయి ధరమ్ తేజ్ వెళ్తుండగా స్కిడ్ అవ్వడంతో పడిపోయారు. దీంతో వెంటనే స్థానికులు ఆయనను దగ్గర్లో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి-ఐకియా జంక్షన్ మార్గంలో మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ట్రంఫ్ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అవ్వడంతో పడిపోయారు. దీంతో వెంటనే స్థానికులు ఆయనను దగ్గర్లో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సాయి తేజ్‌ను పరీక్షించి ఎక్స్ రే స్కానింగ్ వంటి పరీక్షలు చేశారు. ఈలోపు ప్రమాద విషయం తెలుసుకున్న సాయి తేజ్ మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడి సాయి ధరమ్ తేజ్‌ను ఫిల్మ్ నగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడికి అంబులెన్స్‌లో షిఫ్ట్ చేశాక.. నాగబాబు, చిరంజీవి భార్య సురేఖ సహా ఇతర మెగా కుటుంబ సభ్యులు కూడా అపోలోకు చేరుకున్నారు.
స్పందించిన పవన్
అయితే, తొలుత హుటాహుటిన పవన్ కల్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వచ్చారు. లోపల సాయి తేజ్‌ను చూసి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన్ను చూసి బయటికి వస్తుండగా పవన్ కల్యాణ్‌ను విలేకరులు ప్రశ్నించారు. సాయి తేజ్ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. వేరే ఆస్పత్రికి షిఫ్ట్ చేస్తున్నామని, ఇంకా సాయి తేజ్ అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు చెప్పేసి వెంటనే పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బైక్ నుంచి అందుకే పడ్డారు: ఏసీపీ
‘‘ప్రమాద సమయంలో సాయి తేజ్ మద్యం సేవించలేదు. బైక్‌పై సాయి తేజ్ ఒక్కరే ఉన్నారు. ఆయన హెల్మెట్ పెట్టుకొనే ఉన్నారు. అందుకే పెద్ద ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై మట్టి లేదా ఇసుక ఉండడం వల్లే అక్కడ బైక్ స్కిడ్ అయింది. ఆయన ఎక్కువ వేగంగా కూడా వెళ్లడం లేదు. సాయితేజ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.’’ అని మాదాపూర్ ఏసీపీ మీడియాతో వెల్లడించారు.
అంతర్గతంగా విరిగిన ఎముకలు
సాయి ధరమ్ తేజ్‌కు మెడికవర్ వైద్యులు చెస్ట్ స్కానింగ్ నిర్వహించగా క్లావికల్ ఫ్రాక్చర్ అని డాక్టర్లు గుర్తించారు. అంటే ఛాతి, భుజానికి మధ్య ఉండే కనెక్టింగ్ ఎముక లేదా కాలర్ బోన్ విరిగినట్లుగా స్కానింగ్ రిపోర్టులో వెల్లడైంది. దీంతోపాటు మరికొన్ని చిన్న ఫ్రాక్చర్స్ కూడా ఉన్నట్లుగా డాక్టర్లు వెల్లడించారు.
ప్రమాద సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్రంఫ్ బైక్ వాడారు. బైక్ నెంబరు టీఎస్ 07 జీజే 1258. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు మెడికవర్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో మెడికవర్ ఆస్పత్రి ప్రాంగణం రద్దీగా మారింది.
Also Read: Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. అపస్మారక స్థితిలోకి హీరో, ఆస్పత్రికి చిరు, పవన్
Also Read: Sai Dharam Tej: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు