OG Ticket Rates: పవన్ 'OG' టీంకు మళ్లీ షాక్ - టికెట్ ధరలు పెంచేందుకు నో చెప్పిన హైకోర్టు
OG Tickets: పవన్ 'OG' టికెట్ ధరల పెంపుపై మూవీ టీం తరఫు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించలేదు.

OG Movie Team Arugument In High Court On Ticket Rates Hike: తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' టికెట్ రేట్స్ పెంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. టికెట్స్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ స్టే విధించగా డివిజన్ బెంచ్ స్టే అమలు కాకుండా ఆదేశాలిచ్చింది. ఈ అంశంపై శుక్రవారం మూవీ టీం తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఫస్ట్ డే చూడాలి... కానీ...
సినిమా టికెట్ల రేట్లపై కొంతమందికే అభ్యంతరం ఉందని మూవీ టీం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. 'మూవీ రిలీజ్‌కు ముందు టికెట్ ధరలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీ ఫ్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. పిటిషనర్ ఫస్ట్ డే ఫస్ట్ షోనే సినిమా చూడాలని అంటారు. రూ.150 కూడా కష్టం అనుకుంటే సాధారణ రేట్ ఉన్నప్పుడే మూవీ చూడాలి. ఆయనకు నచ్చిన ధరతోనే ఫస్ట్ డే సినిమా చూడాలంటే ఎలా?' అని వాదించారు.
Also Read: జ్యువెలరీ యాడ్ కాదు... 'అనగనగా ఒక రాజు' ప్రోమో - నవీన్ పోలిశెట్టి కామెడీ మూవీ వెరైటీగా...
కాఫీ రూ.500... పిటిషన్ వేయరు
'ఫైవ్ స్టార్ హోటల్‌లో కాఫీ రూ.500 ఉంటుంది. దిల్జిత్ షో అంటే టికెట్ రేట్ వేలల్లో ఉంటుంది. ఆ ధరలపై నిర్వాహకులకే అధికారం ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్‌లో అనిరుధ్ షో ఏర్పాటు చేయాలనుకుంటే అతనికి నచ్చిన రేట్‌లోనే నిర్వహిస్తాడు. సినిమా టికెట్ ధరలను మాత్రం ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది. ఇదే OG సినిమాను ఢిల్లీలో చూడాలంటే టికెట్ రేట్ రూ.1500 ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ రూ.1500 ఉంటుంది. అదే టికెట్ రూ.200కు కావాలని పిటిషనర్ కోర్టుకు ఎందుకు రారు?. దిల్జిత్ షో రూ.10 వేలు ఉన్నా రూ.200 కావాలని ఎందుకు రారు? కేవలం సినిమా టికెట్స్ విషయంలోనే ఇలా పిటిషన్స్ వేస్తున్నారు. మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే పిటిషనర్ సాధారణ టికెట్ రేట్ వచ్చే వరకూ వెయిట్ చేయాలి.' అంటూ మూవీ టీం తరఫు లాయర్ వాదించారు.
మూవీ టీంకు మళ్లీ షాక్
అయితే, టికెట్ ధరల పెంపు అంశంలో మరోసారి మూవీ టీంకు షాక్ తగిలింది. రివ్యూ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం టికెట్ ధరలు పెంచేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం 'OG' ప్రీమియర్ షోలతో పాటు ఫస్ట్ 10 రోజుల వరకూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా... మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో టికెట్ రేట్స్ పెంచడంపై స్టే విధించగా... మూవీ టీం డివిజనల్ బెంచ్ ద్వారా స్టే తెచ్చుకుంది. అయితే, తమ వాదనలు వినకుండానే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని చెప్పగా... డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది. దీంతో శుక్రవారం ఈ అంశంపై విచారించిన కోర్టు... టికెట్ ధరల పెంచేందుకు నో చెప్పింది.





















