Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు - ట్విస్ట్ ఏంటంటే!
Pushpa 2 Actor Allu Arjun | పుష్ప 2 నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించలేదు. బన్నీ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్న వాదనతో కోర్టు ఏకీభవించి 14 రోజుల రిమాండ్ విధించింది.
14 Days Remand For Allu Arjun | హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే నాంపల్లి కోర్టు తీర్పు అమలు చేస్తారా లేదా అేది తేలనుంది.
అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను ప్రవేశపెట్టారు. తనపై నమోదైన అన్ని కేసులను కొట్టివేయాలని అల్లు అర్జున్ ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, అందుకే ఆయనను కేసులో చేర్చి అరెస్ట్ చేశామని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు.
అల్లు అర్జున్‌కు గాంధీలో వైద్య పరీక్షలు
అంతకుముందు అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో బీపీ, షుగర్ తో పాటు, కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. ఈ టెస్టుల్లో అల్లు అర్జున్ కు రిజల్ట్స్ నార్మల్ అని వచ్చాయని తెలిపారు. భద్రతా కారణాలతో సూపరింటెండెంట్ ఆఫీసులో వైద్యుల పర్యవేక్షణలో టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పేషెంట్ల తరఫు బంధువులు ఎగబడ్డారు. అనంతరం పోలీసులు అల్లు అర్జున్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. చట్టప్రకారం అరెస్ట్ చేసి, ప్రొసిజర్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తనపై నమోదైన FIR కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత దిల్‌రాజు హైకోర్టుకు వచ్చారు. అల్లు అర్జున్‌కు ఈ కేసుతో ఎలా సంబంధం ఉంది, ఆయనపై నమోదైన అభియోగాలపై లాయర్ ను కోర్టు అడిగింది. ఘటన నుంచి అరెస్ట్ వరకు అన్ని వివరాలపై న్యాయమూర్తి లాయర్, పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
Also Read: Pushpa 2 Movie: రక్షణ కల్పించాలి పోలీసులకు ముందుగానే లేఖ, బయటపెట్టిన సంధ్య థియేటర్ యాజమాన్యం