Pushpa 2 Movie: రక్షణ కల్పించాలి పోలీసులకు ముందుగానే లేఖ, బయటపెట్టిన సంధ్య థియేటర్ యాజమాన్యం
Sandhya Theater Letter | పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా రక్షణ కల్పించాలని సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖను విడుదల చేశారు.
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో వచ్చి భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోన్న మూవీ పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సెక్యూరిటీ, పర్మిషన్ కోసం సంధ్య థియేటర్ ముందుగానే పోలీసులకు లేఖ రాసింది. పుష్ప2 సినిమా యూనిట్ తమ థియేటర్ వద్దకు 4వ తేదీన రాత్రి 9:30కు వస్తున్నారని, బందోబస్త్ కోసం సంధ్య70m.m యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను 2వ తేదీన కోరింది. ఇందుకు సంబంధించిన లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం విడుదల చేసింది. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిసెంబర్ 4న రాత్రి సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం, తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతికి కారణమైయ్యారని చిక్కడపల్లి పోలీసులు హీరోపై కేసు నమోదు చేశారు. కాగా, నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇదివరకే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, అత్యవసరంగా విచారించాలని అల్లు అర్జున్ తరఫు లాయర్లు కోరారు. ఈ విషయం మధ్యాహ్నం చెబితే ఎలా అంటూ హైకోర్టు పిటిషన్‌ను అత్యవసర విచారణకు నిరాకరించింది. అయితే తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఉదయమే మెన్షన్ చేయాలన్న హైకోర్టు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని లాయర్ ప్రయత్నాలు చేశారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును కోరారు. తాము పిటిషన్‌ను బుధవారం వేశామని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
అయితే అత్యవసర పిటిషన్ అయితే ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు... అల్లు అర్జున్ న్యాయవాదిని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ కోరారు. మధ్యాహ్నం గం.1.30 సమయానికి లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని పీపీ తెలిపారు.
సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి
ఈ కేసులో సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలక వాయిదా వేశారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం: సీపీ సీవీ ఆనంద్
కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ ను పోలీసులు నిర్దారించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిన్నట్టు లా అండ్ ఆర్డర్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం అతనిని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.