సుప్రీంకోర్టుకు వెళ్లిన రాజాసింగ్- సోమవారం విచారణ!
సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు.. అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడం అసాధారణం. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాజాసింగ్.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు తనపై పెట్టిన పీడీయాక్ట్‌పై న్యాయపోరాటానికి సిద్ధపడ్డారు. అక్రమంగా పోలీసులు తనపై ఈ చట్టాన్ని ప్రయోగించారని సుప్రీకోర్టుకు విన్నవించుకోనున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ తరఫున దుబ్బాక శాసనసభ్యుడు, సీనియర్ న్యాయవాది రఘునందన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
రాజాసింగ్‌ను రెండు కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పీడీయాక్ట్ పెట్టారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ సహా షాహినాయత్‌గంజ్ పీఎస్‌లలో నమోదైన కేసులలో అరెస్టు చేశారు. ఒకరోజు ముందు 41 (ఏ) సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి. మంగళ్‌హట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో, షాహినాయత్‌గంజ్ పీఎస్‌లో క్రైమ్ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఫిబ్రవరి 19, 2022న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏప్రిల్ 12న షా ఇనాయత్‌గంజ్‌లో కేసు మరో కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల వేళ, శ్రీరామ నవమి సందర్భంగా వివాదాస్పద కామెంట్స్ చేశారని ఈ ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 153(A), 295(A), 504, 505(2) కేసులు రిజిస్టర్ చేశారు. ఈ కేసులకు సంబంధించి సీఆర్‌పీసీ-41(A) కింద నోటీసులు రాజాసింగ్‌కు ఇచ్చారు.
నిన్న మధ్యాహ్నం అరెస్టు చేశారు. కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. ముందు ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. రెండోసారి మాత్రం పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేశారు.
పీడీ చట్టం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు. సమాజంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, విధ్వంసాలు చేసేవారు మీద ఈ చట్టం కింద 3 నుంచి 12 నెలలపాటు జైళ్లను పెట్టవచ్చు. నిర్బంధించవచ్చు. చట్టం ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని రక్షించడం. సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు.. అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడం అసాధారణం. అయితే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.