Minister Vemula: గవర్నర్ నియామకమే అప్రజాస్వామికం, పదవిలో కొనసాగే అర్హత లేదు - మంత్రి వేముల
మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందర రాజన్‌కి లేదని అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గవర్నర్ తీరును తప్పుబట్టారు. మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందర రాజన్‌కి లేదని అన్నారు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే గవర్నర్ తిరస్కరించడం ఏంటని మండిపడ్డారు. వారికి రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు.
అత్యంత వెనుక బడిన కులాలకు (ఎంబీసీ) చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్ అని.. షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టేనని అన్నారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘గవర్నర్‌గా తమిళిసై నియామకమే అప్రజాస్వామికం’
తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియామకం అయ్యారని మంత్రి వేముల గుర్తు చేశారు. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సర్కారియా కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారని తప్పుబట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని.. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.