Harish Rao: కు.ని. విఫల ఘటనలో డాక్టర్లపై వేటు: హరీశ్ రావు - బాధితులను కలిసిన మంత్రి
బాధితులను పరామర్శించిన తర్వాత మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా మహిళల పరిస్థితిని సమీక్ష చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ విఫలమైన ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలం కావడం విచారకరమని అన్నారు. ఆపరేషన్లు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం బాధితులను మంత్రి హరీష్ రావు బుధవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
బాధితులను పరామర్శించిన తర్వాత మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా మహిళల పరిస్థితిని సమీక్ష చేస్తున్నామని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో 13 మంది, నిమ్స్ ఆస్పత్రిలో 17 మంది మహిళలు చికిత్స పొందుతూ సురక్షితంగా ఉన్నారని అన్నారు. ఇవాళ కొంత మంది, రేపు ఇంకా కొంత మంది డిశ్చార్జ్ అవుతారని అన్నారు. నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ల లైసెన్స్ రద్దు చేశామని వెల్లడించారు. ఏడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారితో నిమ్స్ లో మాట్లాడుతున్న మంత్రి @trsharish గారు.
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) August 31, 2022
ఇబ్రహీంపట్నం ఘటనలో చనిపోవడం దురదృష్టకరం, బాధాకరం. సంఘటన మా దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నాము.
అపోలో 13 మంది, నిమ్స్ 17 మంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. 1/n pic.twitter.com/221nKvTpXB
రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫల ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన విలేకరులతో బుధవారం ఉదయం చిట్ చాట్ నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విఫల ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మామ అల్లుళ్ళు మహిళా హంతకులు అంటూ కేసీఆర్, హరీష్ రావును ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్ రావు పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దని అన్నారు. కారకులు అయిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
సీఎం బిహార్ వెళ్లడం దుర్మార్గం - బండి సంజయ్
నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ ప్రభుత్వం మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బుధవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆరోగ్య మంత్రి హరీష్ రావు తీరుపై మండిపడ్డారు. బాధితులను పరామర్శించకుండా సీఎం కేసీఆర్ బిహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్య అని అన్నారు.