Kalvakuntla Kavitha: ‘అక్కా.. మీ వల్లే మాకు పరిహారం పెరిగింది’.. కవితకు ప్రాజెక్టు నిర్వాసిత రైతులు కృతజ్ఞతలు
Farmers letters to Kalvakuntla Kavitha | కొడంగల్ – నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్వాసిత రైతులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు.

Kodangal Narayanapet irrigation Project | హైదరాబాద్: కొడంగల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణపేట్ జిల్లా దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రామాన్ని జూలై 31న సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకం కోసం భూములు కోల్పోతున్న రైతుల పక్షాన గళమెత్తిన కవితకు రైతులు అక్షరంగా “అక్కా.. మీ వల్లనే మా భూముల పరిహారం రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెరిగింది” అంటూ ధన్యవాదాలు తెలిపారు.
కల్వకుంట్ల కవితకు లేఖ రాసిన రైతులు
ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సంతకాలతో లేఖలు రాస్తూ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వారి భూములు కోల్పోతున్న నేపథ్యంలో, తగిన నష్టపరిహారం లభించకపోతే తమ జీవితం అడుగడుగునా అస్తవ్యస్తమవుతుందని వారు వివరించారు. ఎమ్మెల్సీ కవిత రైతుల తరఫున ధీటుగా నిలబడుతూ, "ఎకరానికి కనీసం రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి" అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు, పరిహారం పెంచేవరకు రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు అండగా నిలిచిన కవిత
రైతులపై ప్రభుత్వ నియంత్రణ, పోలీసులు నిర్బంధానికి పాల్పడి భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నాలను కవిత తీవ్రంగా ఖండించారు. ఈ అంశాన్ని బయటపెట్టి ప్రజల ముందుకు తీసుకువచ్చారు. కవిత ఒత్తిడి, రైతుల నిరంతర పోరాటం ఫలితంగా చివరికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి "ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని" అధికారికంగా హామీ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ప్రాజెక్టు నిర్వాహిత రైతులు జాగృతి అధ్యక్షురాలు కవితకు ధన్యవాదాలు తెలిపారు. "నిజంగా అక్కా, మీరు లేకపోతే ఈ న్యాయం జరిగేది కాదు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు.






















