Satyavathi Rathod in Queue for Urea: యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వంపై విమర్శలు
Urea Issue In Telangana | యూరియా బస్తాల కోసం తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సహకార కేంద్రం వద్ద రైతులతో కలిసి క్యూలైన్లో నిల్చున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Satyavathi Rathod stanging in queue line for Urea | కురవి: తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూలైన్‌లో నిల్చోవడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత అధికంగా ఉంది. అందుకే వారు ఉదయం 5 గంటల నుంచే యూరియా బస్తాల కోంస వ్యవసాయ కేంద్రాల వద్ద, పంపిణీ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు. కొన్నిచోట్ల అయితే మహిళా రైతులు గోడలు దూకి మరి యూరియా కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండాతమడుగు సహకార సంఘం వద్ద సత్యవతి రాథోడ్ యూరియా బస్తాల కోసం రైతులతో పాటు క్యూ లైన్లో కనిపించారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఉన్న 5 ఎకరాల సాగుభూమికి యూరియా కోసం ఆమె గుండ్రాతిమడుగు సొసైటీ వద్ద సహకార కేంద్రానికి వచ్చారు. గంటకు పైగా రైతులతో కలిసి క్యూలైన్లో నిల్చున్న ఆమె తన వంతు రాగానే సాగుభూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్ చూపించి యూరియా కోసం కూపన్లు రాయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారాల తరబడి యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆమెతో చెప్పుకుని వాపోయారు.

రోజుల తరబడి పనులు మానుకుని వచ్చిన రైతులకు పంట సాగు కోసం కనీసం యూరియా ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ లేదని సత్యవతి రాథోడ్ విమర్శించారు. అన్నదాతలు కాళ్లు అరిగేలా సహకార కేంద్రాలు, వ్యవసాయ సంబంధిత కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా వారి అందడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆడంబరపు మాటలతో తప్పించుకోకుండా, తక్షణమే రైతులకు అవసరమైన యూరియా అందించాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. యూరియా కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, అందుకు వారే బాధ్యులన్నారు.
యూరియా కోసం కాళ్లు పట్టుకుని వేడుకుంటున్న రైతులు
ఇటీవల యూరియా బస్తాల కోసం ఓ రైతు ములుగు కలెక్టర్‌ను వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా తనకు ఎలాగైనా యూరియా బస్తాలు ఇప్పించాలని కోరుతూ ఆ రైతు ములుగు కలెక్టర్ కాళ్లు సైతం పట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. యూరియా కోసం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో రైతుల పడిగాపులు కాస్తున్నారు. 4 రోజులుగా తిరుగుతున్నా తమ యూరియా ఇవ్వడం లేదని రైతుల మండిపడ్డారు. తమ గోడును వినిపించుకునే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో సహకార కేంద్రాలవద్ద పాస్ బుక్కులు, చెప్పులను క్యూ లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నీ కాళ్లు మొక్కుతా సార్ యూరియా బస్తా ఇప్పించండంటూ వికారాబాద్ జిల్లాలో ఓ రైతు పోలీసు కాళ్లు పట్టుకోవడం అందర్నీ కలిచివేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు యూరియాను వారి గోదాముల్లో అక్రమంగా నిలువ చేసుకుంటున్నారని.. అందుకే రూ.275 కు రావాల్సిన యూరియా బస్తాను బ్లాక్ మార్కెట్లో రూ.800 కు అక్రమంగా అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రైతుల యూరియా కష్టాలకు కారణం కాంగ్రెస్, బీజేపీ నేతలేనని విమర్శించారు. యూరియా అడిగిన రైతులపై కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వేధించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సూచించారు.






















