Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర కమనీయం - మధ్యాహ్నానికే పూర్తి కానున్న నిమజ్జనం
Ganesh immersion: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తి చేయనున్నారు.

Khairatabad Ganesh immersion: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్ మండపంలో ఈ ఏడాది 69 అడుగుల ఎత్తున్న బడా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. గణేష్ చతుర్థి ఉత్సవాలు ఆగస్టు 27న ప్రారంభమైన నేపథ్యంలో, 11 రోజుల పాటు జరిగిన పూజల అనంతరం సెప్టెంబర్ 6న నిమజ్జనం జరుగుతోంది. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు, భక్తి భావంతో 'గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర... ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్ మీదుగా హుస్సేన్ సాగర్ సరస్సులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. భారీ క్రేన్లు, ట్రాలీల సాయంతో విగ్రహాన్ని తరలిస్తున్నారు. ఈ ఏడాది గణేష్ విగ్రహం 'శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి'గా రూపుదిద్దుకున్నది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , పోలీసు శాఖలు ఈ ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశాయి. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు, జాయింట్ కంట్రోల్ సెంటర్లతో భద్రతా చర్యలు చేపట్టారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వర్షాల కారణంగా విద్యుత్ భద్రత, బారికేడింగ్, వాలంటీర్ల నియామకం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర... కన్నుల పండుగగా సాగుతున్న గణనాధుడు ఊరేగింపు... మహా అద్భుతం! pic.twitter.com/9HKS2yu18v
— MALLIK BASVOJU Official (@EtvMallik) September 6, 2025
ఈ శోభాయాత్రకు సంబంధించి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ వంటి ప్రాంతాల్లో క్రేన్లు, బారికేడ్లు సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు ఈ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలని పోలీసులు సూచనలు జారీ చేశారు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర దేశవ్యాప్తంగా ఫేమస్. 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ వినాయకుడ్ని లక్షల మంది భక్తులు బడా గణపతిని దర్శించుకున్నారు. బడా గణేశుడిని నిమజ్జనం కోసం విజయవాడ నుండి భారీ టస్కర్ ను తీసుకు వచ్చారు. బడా గణేషుడి నిమజ్జన శోభాయాత్ర కోసం నగరవాసులతో పాటుగా.. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు పాల్గొంటున్నారు. అన్ని చోట్లా లడ్డూల వేలం వేయడం సంప్రదాయం. అయితే ఖైరతాబాద్ గణేషుడి లడ్డూను మాత్రం నిర్వాహకులు వేలం వేయరు. నిమజ్జనానికి తరలించే ముందే.. భక్తులకు పంపిణీ చేశారు.



















