Hyderabad Ganesh immersion arrangements: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
Hyderabad: హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నానికే పూర్తి చేయనున్నారు.

Hyderabad Ganesh immersion: గణేష్ నిమజ్జన సందడి ప్రారంభమయింది. శనివారం జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర కోసం హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు, 20,000 నుంచి 50,000 గణేష్ విగ్రహాలు ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ పోలీసు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు నిమజ్జన కేంద్రంగా ఉండగా, 20 సరస్సులు, 74 కృత్రిమ చెరువులు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్‌టిఆర్ మార్గ్, సంజీవయ్య పార్క్‌లో 5 అడుగుల కంటే తక్కువ ఉన్న చిన్న విగ్రహాల కోసం బేబీ పాండ్స్ సిద్ధం చేశారు. 69 అడుగుల ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం కోసం ప్రత్యేక సూపర్ క్రేన్ నెంబర్ 4 ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర సెప్టెంబర్ 6న ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై, టెలిఫోన్ భవన్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్‌టిఆర్ మార్గ్ గుండా 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంటుంది. ఉదయం 10:30 నాటికి విగ్రహం సరస్సు వద్దకు చేరుకుని, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 403 క్రేన్లు 134 స్థిర క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు నగరవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. 56,187 తాత్కాలిక లైట్లు, 9 బోట్లు, 200 మంది ప్రొఫెషనల్ ఈతగాళ్లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు హుస్సేన్ సాగర్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
నిమజ్జనోత్సవం సజావుగా జరిగేందుకు 30,000 మంది పోలీసులు, 733 సీసీటీవీ కెమెరాలు, 160 గణేష్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ గుండా హుస్సేన్ సాగర్‌కు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద మక్కా మసీదు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌లు బాలాపూర్ రూట్‌ను సందర్శించి, చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాట్లను సమీక్షించారు.
భక్తులు వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజా రవాణా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. పార్కింగ్ కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని, భక్తులు బారికేడ్లు, వాలంటీర్ల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.
GHMC 4,000 మంది సిబ్బందిని మూడు షిఫ్ట్‌లలో నియమించింది, 14,486 మంది సానిటేషన్ వర్కర్లు శుభ్రత కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్లు భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. 13 కంట్రోల్ రూమ్‌లు పోలీసుల సహకారంతో నడుస్తాయి.
హైదరాబాద్ నిమజ్జన సందడిని ఏబీపీ దేశం యూట్యూబ్ చానల్ లో చూడవచ్చు.






















