KTR: కాంగ్రెస్ చేతగానితనం, గుజరాత్ తరలిపోతున్న కేన్స్ సంస్థ: కేటీఆర్
Telangana News | కర్ణాటక నుంచి కేన్స్ సంస్థను ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో గుజరాత్ కు సంస్థ తరలిపోతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Kaynes Semicon advanced semiconductor making unit | హైదరాబాద్: తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్ గుజరాత్ కు తరలిపోవడం నిజమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేసి తర్వాత రాష్ట్ర మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. కేన్స్ సంస్థ ఎక్కడికి తరలిపోలేదని, తెలంగాణ (Telangana)లోనే ఉంటుందన్నట్లుగా ప్రకటన చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి వారికి అన్ని అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
రెండు యూనిట్లు గుజరాత్‌కు తరలిపోతున్నాయి
మొత్తం మూడు యూనిట్లలో ఒకటి సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్. కొంగర్ కలాన్ లో అత్యంత ఆధునాతమైన (OSAT) ఏర్పాటు చేయాల్సి ఉంది. PCB యూనిట్ ను వరంగల్ లో ఏర్పాటు చేసేందుకు కేన్స్ కంపెనీని ఒప్పించినట్లు ఓ ప్రకటనలో కేటీఆర్ తెలిపారు. అయితే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సిన (OSAT) గుజరాత్ కు తరలిపోయిందని పేర్కొన్నారు. ఇక వరంగల్ లో ఏర్పాటు చేయాల్సిన PCB యూనిట్ పై స్పష్టత లేదన్నారు. కేన్స్ సంస్థ సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మాత్రమే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత, చేతకానితనం వల్లే ఇలా జరిగిందన్నారు కేటీఆర్.
అది జరిగింటే, హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉండేదన్న కేటీఆర్
ముందు అనుకున్నట్లుగా కొంగర్ కలాన్ లో (OSAT) ను ఏర్పాటు చేసి ఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్ లో మంచి భవిష్యత్ ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం మూడు యూనిట్లు తెలంగాణలో ఏర్పాటుకు తాము ఒప్పించినా.. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో కీలకమైన (OSAT), PCB యూనిట్లు తెలంగాణ నుంచి తరలిపోతున్నాయన్నది వాస్తవం. కానీ ఏమీ జరగలేదన్నట్లుగా మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రెండు పెద్ద ప్రాజెక్ట్ లను రాష్ట్రం కోల్పోయింది.
Also Read: జైనూర్‌లో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు! 144 సెక్షన్ కూడా - జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో పెట్టుబడి దారులు అయోమయానికి గురవుతున్నారని, అందుకు కేన్స్ సంస్థ యూనిట్లు ఇక్కడి నుంచి తరలిపోవడమే నిదర్శనమని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అతి సాధారణమైన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఇక్కడ పెడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇదొక్కటి చెప్పి. అసలు కేన్స్ సంస్థ ఎటు తరలిపోలేదంటూ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఇలా చెప్పడం ప్రజలను మోసం చేయటమేనని.. ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు వెల్లడించాలని ఓ ప్రకటనలో కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆరఎస్ హయాంలో హైదరాబాద్ ను దేశంలో ప్రముఖ ఐటీ హబ్ గా చేసేందుకు కృషిచేయగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కంపెనీలు సైతం వేరే చోటుకు తరలిపోతున్నాయని ఆరోపించారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్