Asifabad News: జైనూర్‌లో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు! 144 సెక్షన్ కూడా - జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!
Jainoor Latest News: జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ ఎస్పీ గౌష్ ఆలం హెచ్చరించారు. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.
Communal tensions in Jainoor: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ వెయ్యి మంది పోలీసులతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ఫ్యూతో పాటు జైనూరులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బయటి వ్యక్తులు జైనూరు వెళ్ళడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పారు. జైనూరు మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ (45)పై షేక్ మగ్దూం అనే ఓ ఆటోడ్రైవర్ లైంగిక దాడికి యత్నించడంతోపాటు తీవ్రంగా గాయపర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన కారణంగానే జైనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని అన్నారు. పోలీసు యంత్రాంగం నిందితుడిపై కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు. వదంతులను ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసిన వారిపై, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు.
ముఖ్యంగా జైనూరులో 144 సెక్షన్ అమలులో ఉందని ఇతర ప్రాంతాలవారికి జైనూరు రావడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. టౌన్ చుట్టూ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ బాధితురాలిని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. డాక్టర్ లతో మాట్లాడి మహిళ ఆరోగ్య పరిస్థితిపై అరా తీశారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచనలు చేశారు. మహిళపై జరిగిన ఘనటను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
Under #Congress rule, Jainoor in Asifabad district faces turmoil as a tribal woman was allegedly raped by an auto driver.
— N Ramchander Rao (@N_RamchanderRao) September 4, 2024
The violence and unrest that followed expose Congress’s failure to protect our tribals and #maintainlaw and order. pic.twitter.com/uxtdnBHRwz