Teachers Day 2024: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
Telangana News | ఇటీవల ప్రభుత్వం తొలగించిన పార్ట్ టైమ్ లెక్చరర్లు, టీచర్లను, డీఈవోలను తిరిగి నియమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన లేఖలో కోరారు.
హైదరాబాద్: రాష్ట్రంలో వేల మంది పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను విధుల నుంచి తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం తొలగించిన సిబ్బందిని మళ్లీ నియమించాలని, దాంతో పాటు పెండింగ్ జీతాలను చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు.
హరీష్ రావు రాసిన లేఖలో ఏముందంటే..
‘సెప్టెంబర్ 5న జరిగే టీచర్స్ డే (Teachers Day) సందర్భంగా టీచర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిచడం ప్రభుత్వం నుంచి ఆనవాయితి. అలాంటి సంప్రదాయాన్ని పాటించకపోగా పాఠాలు చెప్పే గురువులను అర్థాంతరంగా తొలగించి వారికి, వారి కుటుంబాలకు అంతులేని క్షోభను కలిగించారు మీరు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైం లెక్చరర్లు, పార్ట్ టైమ్ టీచర్లు, డీఈవోలను ఒకేసారి విధుల నుంచి తొలగించారు. ఇది అత్యంత దారుణమైన చర్య. దీనిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 3 నెలలుగా వీరికి జీతాలు చెల్లించడం లేదు. పైగా జీతాలు అడిగిన పాపానికి ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించడం సమంజసం కాదు. ఇదేనా మీరు చెపుతున్న ప్రజా పాలన.
విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగిస్తే విద్యార్థులకు కూడా తీరని నష్టం జరుగుతోంది. సిలబస్ పూర్తికాక విద్యార్థులు నష్టపోతారు. తొలగింపునకు గురైన టీచర్లు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణించలేం. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటి కోచింగ్ కూడా అందించే వాళ్లం. ఫలితంగా వేల మంది విద్యార్థులకు ఉన్నత విద్యాలయాల్లో చదువుకునే అవకాశం లభించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో ఐఐటీ కోచింగ్ ఇచ్చే లెక్చరర్లను సైతం తొలగించారు. దీని వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. కనుక వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఎన్ఐటి కోచింగును పునరుద్ధరించాలని’ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.
తొలగించిన పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వారి జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.