Hydra Police Station: నేటి నుండి అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్.. ప్రభుత్వ స్ధలం ఆక్రమిస్తే అరెస్టులే
నేటి నుండి హైడ్రా పోలీస్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇకపై కబ్జారాయుళ్లకు చెక్ పెట్టేందుకు హైడ్రా పోలీసులు రంగంలోకి దిగనున్నారు.చెరువులో మట్టి తరలించినా, నాలాలు ఆక్రమించినా నేరుగా హైడ్రా అరెస్ట్ తప్పదు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను రక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా వరుస కూల్చివేతలతో చరిత్ర సృష్టిస్తోంది. వేల కోట్ల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటోంది. అంతే స్దాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. ఎవరు ఎన్ని చెప్పినా చెరువులను, ప్రభుత్వ స్దలాలను కబ్జా కోరల నుండి మిముక్తి కలిగించిన క్రెడిట్ ఒక్క హైడ్రాకు మాత్రమే దక్కుంది. అంతలా దూసుకుపోతున్న హైడ్రా నేటి నుండి మరింత పవర్ ఫుల్ గా మారనుంది. తెలంగాణలో తొలిసారి హైదరాబాద్ కేంద్రంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్దలాలు ఆక్రమిస్తే , కబ్జాదారులు గీతదాటితే , భరతం పట్టేందుకు నేటి నుండి హైడ్రా పోలీసులు రంగంలోకి దిగనున్నారు.
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రత్యేకత ఇదే..
హైదరాబాద్ నగరంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఇంకా కబ్జాకోరల్లోనే ఉన్నాయి. హైడ్రా ప్రయత్నం కొంతమేరకు సక్సెస్ అయినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. ఈ క్రమంలో హైడ్రా మరింత బలోపేతం చేసేందుకు, ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా పోలీస్టేషన్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కు సమీపంలో ప్రస్తుతం ఉన్న హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీసు స్టేషన్ చేశారు. రాష్ట్రంలో డిజాస్టర్, ఫైర్ విభాగాలకు తోడు ఇప్పుడు సొంతంగా పోలీస్టేషన్ తోడవ్వడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం చేకూరింది. ఈ పోలీస్టేషన్ కు ఎస్‌హెచ్‌వోగా ఏసీపీ పి. తిరుమల్ నియమించారు. ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్ ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. జీ ప్లస్ 2గా నిర్మించిన ఈ పోలీసు స్టేషన్ భవనం 10500ల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది.
నేటి నుండి హైడ్రా అరెస్టులు..
ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై గతంలో స్దానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసేవారు. విచారణ అధికారం కూడా ఆయా పోలీసుల పరిధిలో ఉండేది. కానీ ఇకపై కబ్జాదారులు గీత దాటితే నేరుగా హైడ్రా పోలీసు స్టేషన్ లోనే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. హైడ్రా పోలీసులే విచారణ చేపడతారు. ఈ పోలీస్టేషన్ కు ఉన్న ప్రత్యేక అధికారులను ఉపయోగించి , కబ్జాదారులపై కేసులు నమోదు చేసి అవసరమైతే వారిని అరెస్ట్ కూడా చేస్తారు. అలాగే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో మట్టి పోసిన వారిపై కూడా ఇకపై ఈ స్టేషన్ లోనే కేసులు బుక్ చేస్తారు. మట్టిని తరలించే వాహనదారులపైనే కాకుండా, మట్టిని తరలించేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు కుదుర్చుకున్న వ్యక్తితో పాటు.. ఆ మట్టి ఏ నిర్మాణ సంస్థకు చెందినదో తెలుసుకుని వారిపైన కూడా హైడ్రా పోలీస్టేషన్ లో కేసులు నమోదు చేస్తారు. చెరువుల్లోకి మురుగునీరును నేరుగా వదిలిన వారిపైనా ఇకపై హైడ్రా పోలీస్టేషన్ లోనే కేసులు నమోదు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
హైడ్రా పోలీస్టేషన్ ఏం చేస్తుంది..?
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో నేటి నుండి హైడ్రా పోలీసు స్టేషన్ తేల్చనుంది. పేదవాళ్ల రూపంలో గుడిసెలు వేయించి, తర్వాత కాజేసే బడా వ్యక్తుల భరతం పడతారు హైడ్రా పోలీసులు. నకిలీ పత్రాలు సృష్టించి లే ఔట్లను మాయం చేసిన వారిని, ప్రభుత్వ భూములను కాజేయాలనుకునేవారి గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. వాల్టా యాక్టు, ఫైర్ చట్టాల ఉలంఘనులను నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తారు. లే ఔట్లలో రహదారులను, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అనుమతి లేని ప్రకటనల హోర్డింగుల యజమానులను కట్టడి చేస్తారు.ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటారు.
ఆ కేసులన్నీ ఇక హైడ్రాకే బదిలీ..
లే ఔట్లలో కొన్ని ప్లాట్లు కొని, పక్కన ఉన్న వారి ప్లాట్లు కలిపేసుకుని పాత లే ఔట్లను చెరపట్టిన వారిపై హైడ్రా పోలీసు స్టేషన్ కఠినంగా వ్యవహరిస్తుంది. లే ఔట్‌లో రహదారులు, పార్కులతో పాటు.. సామాన్యుల ప్లాట్లను కాజేసిన వారిని విచారించి న్యాయం జరిగేలా చూస్తుంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థతిని తెలుసుకుని.. బాధ్యులపై హైడ్రా పోలీసులు చర్యలు తీసుకుంటారు. హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల భూములను, పలు చెరువులు, పార్కులు, నాలాలను కాపాడింది. ఆయా ఆక్రమణలకు సంబంధించి వేర్వేరు పోలీసు స్టేషన్లలో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడా కేసులన్నిటిని హైడ్రా పోలీసు స్టేషన్‌కు బదిలీ అవుతాయి. సమస్య మూలాల్లోకి వెళ్లి ఆక్రమణదారులను సరైన ఆధారాలతో జైలుకు పంపడమే లక్ష్యంగా హైడ్రా పోలీసు స్టేషన్ దూసుకుపోనుంది.





















