Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అసలే వరుస పరువు హత్యల ఘటనలతలో నగరవాసులు ఆందోళన చెందుతుండగా.. పట్టపగలే ఓ వివాహితపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది.
Married Woman Stabbed in Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అసలే వరుస పరువు హత్యల ఘటనలతలో నగరవాసులు ఆందోళన చెందుతుండగా.. పట్టపగలే ఓ వివాహితపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై మాజీ ప్రియుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. హఫీజ్ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్ ముందు నిల్చొని ఉన్న మహిళపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు బాధితురాలిని ఒవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాధితురాలు, ముస్లిం మహిళ, నిందితుడు హబీబ్‌పై బాబానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆ మహిళ భర్త ఏడాది కిందట చనిపోయారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హఫీజ్ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్ ముందు నిల్చుండగా.. హబీబ్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి మహిళపై దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోగా, నిందితుడు హబీబ్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
A married woman was critically injured after she was stabbed by her stalker in broad daylight in #Hyderabad on Friday. pic.twitter.com/vtxly9x206
— IANS (@ians_india) May 27, 2022
పట్టపగలే కత్తితో దాడి..
పట్టపగలే అందరూ చూస్తుండగా కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. అక్కడే ఉన్న ఒకరిద్దరూ నిందితుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడు వారిని సైతం కత్తితో బెదిరించాడు. ఆపై మహిళను విచక్షణారహితంగా కత్తితో పొడిచిని హబీబ్ పారిపోయాడు. నిందితుడు మహిళపై కత్తితో దాడికి పాల్పడిన వీడియో సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. వివాహితపై కత్తి దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని స్థానికుల సహాయంతో ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రేమ వ్యవహారం.. నిందితుడిపై గతంలోనే ఫిర్యాదు
ఆ వివాహిత, నిందితుడు హబీబ్ ఒకే బస్తీలో నివాసం ఉండగా, వీరికి పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను హబీబ్ వేధిస్తున్నాడని గతంలోనే బాధితురాలు పలుమార్లు ఫిర్యాదు చేసింది. 2021లో ఓ కేసులో నిందితుడు హబీబ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సంతోష్ నగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. గత కొంతకాలం నుంచి వివాహిత, హబీబ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు హబీబ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఆచూకీ కోసం ఆరాతీస్తున్నారు. త్వరలోనే నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.