Hyderabad Metro: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు
Hyderabad Metro Timings: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
Hyderabad Metro: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలోనే హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు అందుబాటులో ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఈ సేవలను భాగ్యనగర వాసులు ఉపయోగించుకోవాలని సూచించింది. అలాగే ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు.
హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక చర్యలు
గణేష్ నిమజ్జనోత్సవాల కోసం హైదరాబాద్ పోలీసులు సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికి ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. సిటీలో దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధి, గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు.
అంతేకాకుండా విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌కు అనుసంధానం చేశారు. దీంతో విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు జరిగే తంతును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలించే అవకాశం ఉంది. అంతే కాకుండా సామాన్యుడి నుంచి పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను స్మార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది.
భారీ బందోబస్తు
నిమజ్జనం బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆర్టీ, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. అలాగే వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల్లో నిమజ్జనాలు జరుగనున్నాయి. ఈ మేరకు 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని చెరువుల వద్ద ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశారు.