Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం
Heavy Rain In Hyderabad: విఘ్ననాయకుడికి వీడ్కోలు పలుకుతూ వరుణుడు వర్షించాడు. వినాయకుడికి నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
![Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం Hyderabad Ganesh Immersion continues amid Heavy Rain Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/ace89ff97f112ef36c6bbb241a609af21695912188505798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heavy Rain In Hyderabad: విఘ్ననాయకుడికి వీడ్కోలు పలుకుతూ వరుణుడు వర్షించాడు. వినాయకుడికి నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకుని గంగమ్మ చెంతకు చేరుతున్న శంకర తనయుడికి సెలవు చెబుతూ మేఘం వర్షించింది. నగరంలో ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ.. నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. బషీర్ బాగ్‌లో వర్షం కురుస్తున్నా గణనాధులు నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నారు. ఏకధాటిగా వాన పడుతున్న డప్పు చప్పుడ్లు.. నృత్యాలు చేస్తూ.. నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారు. విభిన్న రకాల వినాయకుల భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం పడింది. వర్షం కురుస్తున్నా గణేశుడి నిమజ్జనాలు కొనసాగాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన వర్షంలోనూ వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగుతుంది. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్దకు విగ్రహాలు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. దీనికి తోడు అక్కడ వర్షం కురడంతో నిమజ్జనం ఊరేగింపు సాగింది. నిజాంపేట్, ప్రగతినగర్, ఆల్విన్‌కాలనీ, కుత్బుల్లాపూర్, గుండ్ల పోచంపల్లి, హైదర్‌నగర్, పేట్ బషీరాబాద్, బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, సుచిత్ర, బాలానగర్, జగద్గిరిగుట్ట, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో వినాయక నిమజ్జనం ఊరేగింపు నెమ్మదిగా సాగుతోంది.
అలాగే మారేడ్‌పల్లి, సీతాఫల్మండి, బోయిన్పల్లి, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, ప్యారడైజ్, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్‌పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్‌మెట్, అడ్డగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయినా శోభాయాత్రకు భక్తుల పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వర్షం తాకిడికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేసిస్తున్నారు.
రెండు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గురు, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు 040-21111111, 90001 13667 నంబర్లకు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
గంగమ్మ చెంతకు చేరిన ఖైరతాబాద్ గణేషుడు
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. షెడ్యూల్ కంటే ముందుగానే ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర ఏడు గంటలపాటు నిర్విరామంగా కొనసాగింది. దారి పొడువుగా గణపయ్యకు భక్తులు నీరాజనాలు పలికారు. మహాగణపతి ముందు యువత తీన్మార్ డ్యాన్సులతో హోరెత్తించారు. గణేష్ నామస్మరణతో ట్యాంక్‌బండ్ మారుమోగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బడా గణేష్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు.
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్రేన్ నెంబర్-4 వద్దకు మహాగణపతి రాగా, గంటపాటు వెల్డింగ్ పనులు జరిగాయి. అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించారు. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)