Electric Bike Blast: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదం, పేలిన బ్యాలరీ - ఒకరికి గాయాలు
ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న చుండి కోటేశ్వరరావు అనే 33 ఏళ్ల వ్యక్తి మ్యాక్ అనే కంపెనీకి చెందిన తన ఎలక్ర్టిక్ బైక్ కు శనివారం రాత్రి తన ఇంట్లో చార్జింగ్ పెట్టాడు.
Electric Bike Blast: హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదం జరిగింది. బ్యాటరీకి చార్జింగ్ పెడుతుండగా అది పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న చుండి కోటేశ్వరరావు అనే 33 ఏళ్ల వ్యక్తి మ్యాక్ అనే కంపెనీకి చెందిన తన ఎలక్ర్టిక్ బైక్ కు శనివారం రాత్రి తన ఇంట్లో చార్జింగ్ పెట్టాడు. అయితే చార్జింగ్‌ను చెక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనంలోని బ్యాటరీ పెద్ద సౌండుతో పేలి మంటలు వచ్చాయి. దీంతో కోటేశ్వర రావు ముఖం, చేతులు, ఛాతికి మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, మంటలు ఆర్పారు. వెంటనే గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
గత జూన్‌లో సిద్దిపేటలోనూ
జూన్ నెలలో సిద్దిపేటలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటి ముందు ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలింది. దీంతో ఏకంగా ఇల్లు కూడా దగ్దం అయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పెద్ద చీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దుర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటీని పార్క్ చేశారు. అక్కడే ఛార్జింగ్ కూడా పెట్టారు. అయితే, అనుకోకుండా స్కూటీ నుంచి మంటలు చెలరేగి పేలింది. ఆ మంటలకు దుర్గయ్య ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా శబ్దం రావడంతో ఇంట్లోని వారు లేచి చూశారు. ఇంటికి కూడా నిప్పు అంటుకొని ఉండడంతో ఇంట్లోవారు ప్రాణ భయంతో బయటికి పరిగెత్తారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఏప్రిల్ లో విజయవాడలో, ఒకరు దుర్మరణం
విజయవాడలో ఛార్జింగ్ పెట్టగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన (Electric Bike Battery Blast Vijayawada) ఘటన కలకలం రేపింది. బ్యాటరీ పేలడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి కాలిన గాయాలయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కొన్న 24 గంటల్లోనే పేలడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యనారాయణపురం గులాబీ తోటకు చెందిన శివకుమార్ శుక్రవారం కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశారు. ఎన్నో రోజులనుంచి అనుకున్న తమ కల నెరవేరిందని భావించారు. పెట్రోల్ ధరల మోత ఉండదని, తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ పెట్టుకుని ఎంచక్కా తిరగవచ్చునని భావించిన కుటుంబం జరగబోయే విషాదాన్ని ఊహించలేదు. బైక్ బ్యాటరీకి ఇంటిలోని ఓ రూమ్‌లో ఉంచి రాత్రి చార్జింగ్ పెట్టాడు శివకుమార్. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకున్నా.. స్థానికులు అతికష్టమ్మీద శివ కుమార్‌ను, ఆయన భార్య, ఇద్దరు పిల్లలను రక్షించి చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులో బైక్ పేలడంతో తండ్రి, కూతురు మృతి
గత మార్చిలో తమిళనాడులో ఈ తరహా ఘటనలో తండ్రి కూతురు ప్రాణాలు కోల్పోయారు. వేలూరు జిల్లా చిన్నపూర్ బలరామ్ వీధిలో గత మార్చి నెలలో ఈ ఘటన జరిగింది. బ్యాటరీ వాహనానికి ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు తురై వర్మ. కానీ అర్ధరాత్రి ఒంటిగంటకు ఒక్కసారిగా బ్యాటరీ వాహనం పేలడం తో తండ్రి తురై వర్మ, మోహన్ ప్రీతిలు అక్కడిక్కడే మృతి చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు జిల్లాలోని చిన్నపూర్ బలరామ్ వీధిలో తురైవర్మ, తన కూతురు మోహన్ ప్రీతితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ల్లాపురం రోడ్డులో తురైవర్మకు ఓ ఫోటో స్టూడియో ఉంది. ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి కనుక ఎలక్ట్రిక్ బైక్ కొనాలని భావించారు. మూడు రోజుల క్రితం తిరువణ్ణామలై జిల్లా పోలూరులో రూ.95,000తో బ్యాటరీ సహాయంతో నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఇంతలోనే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు.