YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
YS Jagan Comments on Google Data Center: విశాఖలోకి గూగుల్ రావడానికి ప్రధాన కారణం వైపీసీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు వైఎస్ జగన్. అలాంటిది ఎందుకు వ్యతిరేకిస్తామని ప్రశ్నిస్తున్నారు.

YS Jagan Comments on Google Data Center: ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ డాటా సెంటర్ రావడానికి పునాది వేసిందే వైసీపీ ప్రభుత్వమని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అలాంటి డాటా సెంటర్‌ను తాము ఎందుకు వ్యతిరేకిస్తామని మీడియాను ప్రశ్నిస్తారు. వైసీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల కృషి ఫలితంగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చిందన్నారు. అదానీ డాటా సెంటర్‌కు 3 మే 2023లో శంకుస్థాపన చేశామని, అంతకు ముందు సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చేందుకు ఒప్పందం జరిగిందన్నారు. వీటి ఫలితమే నేటి గూగుల్ డాటా సెంటర్ రాకకు కారణమని పేర్కొన్నారు. ఇందులో వేరే వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేని చంద్రబాబు అంతా తన గొప్పేనంటూ చెప్పుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే గూగుల్ డాటా సెంటర్ అని గూగుల్ చెప్పిందని అన్నారు. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్ కంపెనీ రాసిన లేఖే ఉదాహరణగా చూపించారు.
ఇంత పెద్ద సంస్థ రావడానికి కారణమైన వారికి కనీస కృతజ్ఞత కూడా చంద్రబాబు చెప్పలేదని జగన్ విమర్శించారు. కానీ వేరే వాళ్ల క్రెడిట్‌ను మాత్రం కొట్టేస్తారని ఆరోపించారు. గూగుల్ డాటా సెంటర్‌తో ఉద్యోగాలు రావని కానీ ఎకో సిస్టమ్ ఏర్పాడుతుందని భవిష్యత్‌లో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు ఎఫిషియన్సీలో వీక్ అని క్రెడిట్ చోరీలో మాత్రం పీక్ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో కూడా అదే చేశారని అన్నారు. తానే కట్టినట్టు బిల్డప్ ఇస్తుంటారని, కానీ వైఎస్ వచ్చిన తర్వాతే హైదరాబాద్ రాత మారిందన్నారు. హైదరాబాద్ సైబర్ టవర్స్‌కు పునాది వేసింది జనార్దన్ రెడ్డి అయితే ఆ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదని అన్నారు. 2004 తర్వాత చంద్రబాబుకు అక్కడ జరిగే వాటితో సంబంధం లేకపోయినా జరుగుతున్న అభివృద్ధి అంతా తానే చేసినట్టు క్రెడిట్ కొట్టేస్తుంటారని ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు మంచి జరిగింది వైఎస్, కేసీఆర్ హయాంలోనే అని అన్నారు. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌పెరిగాయని లెక్కలు చూపించారు.
వేరే వాళ్ల క్రెడిట్ కొట్టేయడమే కాకుండా వేరే తన తప్పులను వేరే వాళ్లపై వేస్తారని అన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న నకిలీ మద్యం కుంభకోణం ఉదాహరణ అని వివరించారు. రాష్ట్రంలో పద్దతి ప్రకారం నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృత నేరంగా చేశారని ఇందులో వైసీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నది టీడీపీ నేతలేనని వాటిని అమ్ముతున్నది కూడా టీడీపీ నేతలు దక్కించుకున్న మద్యం షాపుల్లోనేనని, అంతే కాకుండా పోలీసుల సమక్షలో గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నడుపుతున్నారని ఆరోపించారు. వాటాల్లో వచ్చిన భేదాభిప్రాయాలతో నకిలీ మద్యం బాగోతం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ప్రజలు చచ్చిపోతున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా పట్టించుకోవడం లేదని తమ జేబులు నిండాయాలేదా అన్న ధోరణితో చంద్రబాబు పాలిస్తున్నారని అన్నారు.
వ్యాపారులు, నకిలీ మద్యం తయారీదారులు అంతా టీడీపీ నేతలే ఉన్నారని, కానీ ఈ కేసులో వైసీపీ నేతలను వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. జనార్దన్ రావు అనే వ్యక్తిని విదేశాలకు వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆయన తన ఫోన్ పోయిందని చెప్పిన ఆ ఫోన్ నుంచే వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లు ఎలా లీక్ అవుతున్నాయని నిలదీశారు. కథ, స్క్రీన్‌ప్లే అంతా వీళ్లే నడిపిస్తున్నారని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు తనిఖీలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. జయచంద్రారెడ్డి అనే నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని క్వశ్చన్ చేశారు.
జోగి రమేష్‌పై నేరం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు. జనార్దన్‌తో తనకు పరిచయం లేదని ఎప్పుడో పెళ్లిలో కలిసిన ఫొటోను ప్రచారం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని ధైర్యంతో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఏదో క్యూఆర్ కోడ్‌లు తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ అలాంటి పద్ధతి ప్రవేశ పెట్టింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్‌లతో ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు నకిలీ మద్యం వ్యాపారం చేసే వాళ్లకే క్యూఆర్ కోడ్ ఇస్తే జరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించాడు.





















