కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
మేడ్చల్ జిల్లా పోచారంలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనను చేధించారు రాచకొండ పోలీసులు. గోవుల అక్రమ రవాణా వెనుక ఏం జరిగింది, సోనూ సింగ్ పై ఇబ్రహీం ఎందుకు కాల్పులు జరిపాడో అసలు కథ చెప్పేశారు సీపీ.

తెలంగాణలో సంచలనం రేపిన పోచారం కాల్పుల ఘటనను12గంటల్లోపే చేధించారు రాచకొండ పోలీసులు. మొత్తం నలుగురు నిందితులలో ఒకరు పరారీలో ఉండగా, ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని మీడియా ముంద ప్రవేశపెట్టారు. బుధవారం సాయంత్రం పోచారం ఐటీ కారిడార్ పోలిస్‌స్టేషన్ పరిధిలో యమ్నంపేట వద్ద ప్రశాంత్ అలియాస్ సోనూ సింగ్ అనే బీజేపి కార్యకర్తపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే తెలంగాణ బీజేపి కీలకనేతలు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు ఈటల, అధ్యక్షుడు రామచంద్రరావుసైతం ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్న సోనూ సింగ్‌ను స్వయంగా వెళ్లి పరామర్శించారు. దాడి ఘటనపై , పోలీసు వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంతలా రాజకీయ దుమారం రేపిన సంచలన కేసులో అత్యంత వేగంగా నిందితులను పట్టుకోగలిగామంటున్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. కాల్పుల వెనుక వాస్తవాలను మీడియా సమావేశంలో వివరించిన సీపీ ఏమన్నారంటే..

అక్టోబర్ 22వ తేది సాయంత్రం యమ్నంపేట్ వద్ద జరిగిన కాల్పుల్లో గోసంరక్షక్ నేత ప్రశాంత్ అలియాస్ సోనూ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో సోనూ సింగ్ పై కాల్పులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఏ1 మొహ్మద్ ఇబ్రహీం ఖురేషీతోపాటు ఇతనికి సహకరించిన నిందితులలో ఏ3 కురవ శ్రీనివాస్, ఏ4 హసన్ బిన్ మొసిన్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఏ2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం వచ్చింది..
స్దానికంగా నివసించే ఇబ్రహీం గత 12 సంవత్సరాలుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడు. కాల్పులు జరిపిన ఇబ్రహీంకు, గాయపడ్డ సోనూ సింగ్ కు గతంలో పరిచయాలున్నాయి. పశువల రవాణాలో భాగంగా అక్రమంగా గోవులను తరలించే క్రమంలో ఆరుసార్లు గోరవాణాను అడ్డుకున్నాడు సోనూ సింగ్. ఇలా అడ్డుకోవడం వల్ల ఇబ్రహీంకు కోటి రూపాయల నష్టం వచ్చింది. భారీగా నష్టం రావడంతో సోనూ సింగ్ పై కక్ష పెంచుకున్నాడు ఇబ్రహీం. వీరిద్దరికి పరిచయం ఏర్పడిన తరువాత గోవులను అక్రమ రవాణా వ్యవహారంలో ఎందుకు తేడా వచ్చింది., గతంలో సోనూ సహకరించాడా అనే కోణంలో సైతం విచారణ చేస్తున్నానట్లు సీపీ తెలిపారు. 
పశువుల అక్రమ రవాణా చేయాలంటే తనకు 5లక్షల రూపాయలు ఇవ్వాలని సోనూ సింగ్ బెదిరించినట్లుగా ఇబ్రహీంతోపాటు మిగతా నిందితులు చెబుతున్నారు. సోనూ సింగ్ నిజంగా బెదిరించాడా,లేక కావాలనే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అనే అంశాలపై విచారణ చేస్తున్నామన్నారు. అయితే కాల్పులు జరిగిన రోజు నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్ , సోనూ సింగ్ ను సెటిల్ చేసుకుందాం రమ్మంటూ కాల్పులు జరిగిన స్పాట్ కు రప్పించాడని సీపీ తెలిపారు. మాట్లడుకుందాం రమ్మంటూ సోనూను పిలిచిన నిందితులు , వచ్చిన వెంటనే కాల్పులు జరిపి పారిపోయారన్నారు. సోనూ సింగ్ పై పక్కా ప్లాన్ ప్రకారమే కాల్పులకు పాల్పడునట్లుగా పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ముందు ఛత్తీస్‌గఢ్ నుంచి గన్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులొో తేలిందన్నారు. నిందితులు వాడిన వెహికల్ తోపాటు గన్ , మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సోనూ సింగ్ ఆరోగ్యపరిస్దితి నిలకడగా ఉందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సంవత్సరం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,110 పశువులను ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకోవడంతోపాటు, పశువుల అక్రమ రవాణాకు సంబంధించి 288 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు సుధీర్ బాబు.





















