Hyderabad Crime News: సినిమా ఛాన్స్‌ల పేరిట ఓ వ్యక్తి వంచన- మోసపోయి కాకినాడ మహిళ ఆత్మహత్య
Hyderabad Crime News: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఇంట్లో పని చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అవసరం తీరాక వెళ్లిపోమనడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.
Hyderabad Crime News: కన్నడ సినిమాల్లో నటించడంతో పాటు ప్రస్తుతం హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.. తన ఇంట్లో పని చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పాడు. నమ్మిన ఆమె అతిడికి లొంగిపోయింది. అదే ఆమె పాలిట శాపమైంది. ఆమెతో అవసరం తీరిన వెంటనే పనిలోంచి వెళ్లిపోవాలని.. మరో పని మనిషిని తీసుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బిల్డింగ్ లోని 21వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణ చందర్ రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. పది సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్ మెంట్స్ 15 ఎల్ హెట్ బ్లాక్ లో భార్య, కుమార్తెతో ఉంటూ.. బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు.
కూతురు చిన్నదిగా ఉండడంతో కేర్ టేకర్ గా పదేళ్లగా కాకినాడకు చెందిన బిందు శ్రీ పని చేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటూ పాపను చూసుకుంటోంది. ఈక్రమంలోనే బిందుశ్రీకి పూర్ణ చందర్ సినిమాల ఆశ చూపించడం మొదలు పెట్టాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆమెను ఆకర్షించాడు. ఆమెకు కూడా అతడు నచ్చడంతో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. చాలా రోజుల పాటు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి.
ఐదు రోజుల క్రితం పూర్ణచంద్ రావు కుమార్తెను చూసుకోవడానికి మరో కొత్త కేర్ టేకర్ ను ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి బిందు శ్రీ అతడితో గొడవ పడింది. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఇద్దరూ విపరీతంగా వాదించుకున్నారు. అనంతరం బిందు శ్రీ అదే బిల్డింగ్ పైకి వెళ్లి 21వ అంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకుంది.
విషయం గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటననా స్థలానికి చేరుకున్న పోలీసులు బిందుశ్రీ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పని మనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్ రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్ కు వెళ్లారు. వారు వెళ్లిన అరగంట తర్వాత తలుపులు తీయడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.
పూర్ణ చందర్ రావు కన్నడ సినిమాల్లో నటించానంటూ ప్రచారం చేసుకునేవాడు. సినీ పరిశ్రమలో తనకు ఉన్న పరిచయాలతో ఛాన్సులు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశ చూపుతుండే వాడని స్థానికులు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలు, మహిళలు వచ్చిపోవడ, అనుమానాస్పదంగా తిరగడం గమనించినట్లు అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న పలువురు చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు కూడా నలుగురు అమ్మాయిలు అతడి ఫ్లాట్ కు వచ్చినట్లు వివరించారు. అయితే బిందుశ్రీది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. పూర్ణచందర్ రావు వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణ చందర్ రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.