High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో నేటి నుండి హైదరాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎస్పీజీ పోలీసులు, అదనపు బలగాలు భద్రత కట్టుదిట్టం చేశాయి.
బీజేపీ ఎఫెక్ట్.. చార్మినార్ వద్ద కట్టుదిట్టమైన భద్రత..
హైదరాబాద్‌లో నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభ దృష్ట్యా నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఈ రెండు రోజులూ వీఐపీలు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం అమ్మవారిని దర్శించుకోనున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. గత రెండు రోజులుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకుంటున్న ప్రముఖలు సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై చార్మినార్ చుట్టూ పికెట్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజయవంతం చేసి తీరుతాం... కిషన్ రెడ్డి
జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లడుతూ.. హైదరాబాద్‌లో నిర్వహించబోయే జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం తొలిసారి అని తెలిపారు. ప్రశాంతంగా బీజేపీ సమావేశాలు జరగనివ్వకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజారి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ సమావేశాలకు ప్రచారం రాకూడదని రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగినా సరే సమావేశాలు విజయవంతం చేసి తీరుతామని చెప్పారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైలు నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి, సుమారు 25 రైళ్లలో 50 వేల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాల నుంచి వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్ చేసి.. మెట్రో రైళ్లలో సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మోదీ సభకు తరలిరావాలని కోరుతూ సుమారు 10 లక్షల ఆహ్వాన పత్రికలను రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. వర్షం వచ్చినా ఆటంకం లేకుండా, ప్రధాని బహిరంగసభలో వర్షం కురిసినా జనానికి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో కూడిన జర్మన్ హ్యాంగర్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
నాలుగు అంచెల భద్రత
నేటి నుంచి రెండు రోజుల పాటు నగరంలోనే ప్రధాని మోదీ ఉండనున్న నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న ఆయన.. ఈ నెల 3వ తేదీన సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. నేడు, రేపు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు. ప్రధాని టూర్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వీఐపీ & వీవీఐపీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఎప్పీజీ రంగంలోకి దిగింది. నగరంలోని వివిధ విభాగాల పోలీసు బలగాలతో పాటు, నోవాటెల్ హోటల్ చుట్టూ ఇతర ప్రాంతాల నుండి అదనపు బలగాలు మోహరించారు. ఇప్పటికే నోవేటెల్ హోటల్ చుట్టూ నాలుగు అంచాల వీఐపీ భద్రత ఏర్పాటు చేశారు.
శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీజీ బృందం ఎప్పటికప్పుడు తెలంగాణ పోలీసులతో కో-ఆర్డినేట్ చేస్తోంది. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. 4 అంచల భద్రతతో పాటు వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోదీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి. అదనంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, రాష్ట్ర- నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు ఆక్టోపస్ బృందాలు ప్రధాని భద్రతలో నిమఘ్నం అవుతున్నాయి. ప్రధాని మోదీ భద్రతో హైడ్ సెక్యురిటీ ( కంటికి కనిపించకుండా మెరుపు దాడి చేసే భద్రతా వలయం), పిటింగ్ (వేరీ షార్ప్ ఇంటలిజెన్స్, షార్ప్ షూటర్, ఆక్టివ్, విత్ ఆఫీసర్స్ గైడ్ లైన్స్ ), ల్వోల్టా సెక్యురిటీ ( హై రిస్క్ స్కిల్స్ సెక్యూరిటీ గార్డ్స్ ), స్నిపర్ డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు, ముఫ్తీ పార్టీలకు త్వరిత ప్రతిస్పందన బృందాలు ( ఎస్బీ, ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ బ్యూరో ) మోహరించున్నారు. ఎప్పటికప్పుడు నగరంలో భద్రతా ఏర్పాట్లను అంచనా వేస్తూనే ఉన్నాయి ఎస్పీజీ బృందాలు. ఎస్పీజీ బ్లూ బుక్ గైడ్ లైన్స్ ప్రకారం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండనున్నాయి.
ఓవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా పరిస్థితి మారింది. ఇదే సమయంలో బైబై మోదీ లాంటి క్యాంపెయిన్‌లు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఫ్లెక్సీ, హోర్డింగ్‌ల వార్ కూడా నడుస్తోంది. ఇక, అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఇటీవల నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసమే జరిగింది. ఇవన్నీ అంచనా వేసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !