G Kishan Reddy: గోషామహల్ బీజేపీ టికెట్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సిలిండర్ తగ్గింపు ధరలపైన కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రాఖీ కానుకగా సిలిండర్ ధరపై 200 తగ్గింపు ఆనందకరం అని అన్నారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆ స్థానం నుంచి టికెట్ ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్ణయం పూర్తిగా ఢిల్లీలోని అధిష్ఠానం తీసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. దీనికోసం ఎలక్షన్ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సమావేశం అయిన తర్వాత అభ్యర్థుల ప్రకటన త్వరలోనే చేస్తామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సిలిండర్ తగ్గింపు ధరలపైన కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రాఖీ కానుకగా సిలిండర్ ధరపై 200 తగ్గింపు ఆనందకరం అని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించి ధరలు తక్కువ చేశాయని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం వేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబరు 17 తర్వాత తాము రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతామని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తామని అన్నారు. తమది కేడర్ ఆధారిత పార్టీ అని.. బీఆర్ఎస్ తరహాలో కుటుంబ పార్టీల డైనింగ్ టేబుల్‌పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమని అన్నారు. కేడర్‌తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు.
గోషామహల్ టికెట్ పై రాజాసింగ్ వ్యాఖ్యలు ఇవీ
బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయలు పక్కన పెడతా కానీ.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని రాజా సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ హిందూ రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని రాజా సింగ్ పేర్కొన్నారు. బీజేపీ అధిస్టానం తనకు సానుకూలంగా ఉందని.. సరైన సమయం చూసి తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తారని రాజా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. ప్రాణం పోయినా తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోషా మహాల్ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్ధి ప్రకటించకపోవడం ఆయన సెటైర్లు వేశారు. ఆ సీటు ఎవరికి కేటాయించాలనేది ఎంఐఎం నిర్ణయిస్తుందని ఎద్దేవా చేశారు.. మజ్లిస్ పార్టీ సూచించిన అభ్యర్ధే ఇక్కడ కారు గుర్తుపై పోటీ చేస్తారని తెలిపారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారన్నారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారన్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఒత్తిడి?
గోషామహల్ స్థానాన్ని వదులుకొని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఒప్పుకుంటేనే సస్పెన్షన్ తొలగించే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం రాజాసింగ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సస్పెన్షన్‌పై జాప్యం జరుగుతోందని గుసగుసలు వినపడుతున్నాయి. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను పోటీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గోషామహల్‌ను వదిలిపెట్టాలని రాజాసింగ్‌కు అధిష్టానం సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.