Artificial Beach in Hyderabad: హైదరాబాద్ వాసులకు చిల్లింగ్ న్యూస్ - బీచ్ వచ్చేస్తోంది - జోక్ కాదు సీరియస్సే !
Hyderabad Beach: హైదరాబాద్‌కు అన్నీ ఉన్నాయి కానీ బీచ్ మాత్రం లేదు. ఈ కొరత కూడా తీరనుంది. కృత్రిమ బీచ్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

Hyderabad Artificial Beach: హైదరాబాద్ అందమైన నగరం. ఉపాధికి, విద్యకు లోటు లేదు. అలాగే వినోదాలకూ హద్దు ఉండదు. కానీ ఒక్కటే లోపం ..అదే బీచ్ లేపోవడం. హైదరాబాద్ సముద్రం ఒడ్డున లేదు ..కనీసం వంద కిలోమీటర్ల దూరంలోనూ లేదు. అందుకే బీచ్ అనేది హైదరాబాద్ వాసులకు లోటు. అందుకే అప్పుడప్పుడూ రాజకీయ నేతలు.. హైదరాబాద్ కు బీచ్‌ను తెస్తామని హామీలిస్తారని సెటైర్లు పడుతూంటాయి. కానీ ఇప్పుడు సెటైర్లు కాదు..నిజంగానే చీచ్ ను తెస్తున్నారు. కాకపోతే.. కృత్రిమ బీచ్.
హైదరాబాద్‌లో మొట్టమొదటి అర్టిఫిషియల్ బీచ్ ఈ ఏడాది డిసెంబర్‌లో కొత్వాల్ గూడ వద్ద ప్రారంభం కానుంది. రూ.225 కోట్ల బడ్జెట్‌తో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్, సముద్ర తీర అనుభవాన్ని అందించే మానవ నిర్మిత సరస్సు. ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాస్, వేవ్ పూల్స్ వంటి సౌకర్యాలతో నగరవాసులకు వారాంతపు వినోదాన్ని అందించనుంది.
సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ అర్టిఫిషియల్ బీచ్, సముద్ర తీరాన్ని పోలిన అనుభవాన్ని అందించేలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర టూరిజం రంగంలో కీలకమైన అడుగుగా చెబుతున్నారు.
ఈ అర్టిఫిషియల్ బీచ్ కేవలం ఇసుక , నీటితో మాత్రమే పరిమితం కాదు. ఇందులో ఫ్లోటింగ్ విల్లాస్, స్టార్-కేటగిరీ హోటళ్లు, వేవ్ పూల్స్, ఫుడ్ కోర్టులు, థియేట్రికల్ వేదికలు, డెకరేటివ్ ఫౌంటైన్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, స్కేటింగ్, బంజీ జంపింగ్, సెయిలింగ్, సిమ్యులేటెడ్ వింటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ సౌకర్యాలు కుటుంబాలకు ఒక రోజంతా ఆనందించే అనుభవాన్ని అందించేలా సిద్ధం చేస్తారు.
తెలంగాణలో టూరిజం రూ. 15,000 కోట్ల స్థాయిలో ఉంది. ఈ అర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌ను గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ నగరవాసులకు నగరం వెలుపల ప్రయాణం చేయకుండానే వారాంత వినోదాన్ని అందించడంతో పాటు, హైదరాబాద్‌ను ఒక డైనమిక్ అర్బన్ రిట్రీట్‌గా రూపొందించనుంది.
🚨 JUST IN
— SaffronSoul (@TheRealDharm) August 28, 2025
Hyderabad is set to get its first artificial beach near Kotwal Guda, with construction starting in December 2025.
The ₹225 crore project will feature adventure sports, floating villas, luxury hotels, wave pools, parks, cycling tracks & food courts. pic.twitter.com/QbsUG6g6mA
కొట్వాల్ గూడ, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం వల్ల అద్భుతమైన కనెక్టివిటీ , విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిర్మాణ సమయంలో పర్యావరణ రక్షణ చర్యలను అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించేలా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలైతే, హైదరాబాద్‌ను ఒక ల్యాండ్‌లాక్ నగరం నుండి ఒక ఆకర్షణీయమైన టూరిజం హబ్‌గా మార్చే అవకాశం ఉంది.




















