అన్వేషించండి
Telangana Cabinet Meeting: మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
Telangana CM Revanth Reddy: కేబినెట్ లోకి మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ చేరాక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
Source : ABP Desam
TG Cabinet Meeting News Today | హైదరాబాద్: కేబినెట్ విస్తరణ తరువాత తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet Meeting) తొలిసారి సోమవారం సాయంత్రం సమావేశమైంది. హైదరాబాద్‌లోని బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Rededy) అధ్యక్షతన కేబినెట్ భేటీ మొదలైంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తొలిసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బనకచర్ల / పోలవరం నీటి ప్రాజెక్టు వివాదంపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై, రైతు భరోసా, ఇంద్రమ్మ హౌసింగ్ తదితర పథకాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మంత్రివర్గం ఈ భేటీలో చర్చించనుంది. సామాజిక న్యాయం, నీటి రక్షణ, గ్రామీణ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకునే అకాశాలున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల సమస్య
స్థానిక సంస్థల్లో కులాల ఆధారంగా రిజర్వేషన్లపై డిమాండ్ పెరుగుతోంది. కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ఎలా ముందుకెళ్లాలో మంత్రులు చర్చించనున్నారు. ఇటీవల జరిగిన కుల గణన ఆధారంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సంస్థల్లో రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు జూలైలో నిర్వహించాలని భావిస్తున్నా, రిజర్వేషన్ల సమస్యల వల్ల ఆగస్టుకి వాయిదా వేయాలని భావిస్తున్నారు.
ఏపీతో సాగునీటి ప్రాజెక్టులు, నీళ్ల వాటాపై చర్చలకు..
బనకచర్ల / పోలవరం నీటి ప్రాజెక్టులపై చర్చ కీలకంగా మారనుంది. ఏపీ ప్రభుత్వం గోదావరి మిగులు జలాలను పోలవరం నుంచి తరలించి బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల లింక్ పై తెలంగాణ ప్రభావాన్ని అంచనా వేసి, చట్టపరమైన, లేక చర్చల ద్వారా దీన్ని తేల్చడంపై చర్చిస్తారు. ఏపీ ప్రభుత్వంతో నీటి వివాదాలు & ఆదాయ వనరులపై జరపాల్సిన చర్చలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. నీటి పంపకం, ఆదాయ వనరుల పెంపుపైన మంత్రివర్గంలో చర్చకు అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న KLIS నిర్ణయాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు జూన్ 30 లోపు సమాధానం ఇవ్వాలన్న దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. కమిషన్ ఎదుట ఇదివరకే మాజీ సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావు హాజరై ప్రాజెక్టుపై వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
హామీల అమలు, నిధుల సేకరణపై చర్చ
కరీఫ్ సీజన్ కావడంతో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతు భరోసా, ఇంద్రమ్మ హౌసింగ్ తదితర పథకాలపై సమీక్షిస్తారు. రైతులకు, యువతకు, మహిళలకు మద్దతుగా రూపొందించిన పథకాల అమలపై సమీక్షించనున్నారు. ఇటీవల కేబినెట్ లోకి ముగ్గురు మంత్రులు చేరాక పూర్తిస్థాయి కేబినెట్‌తో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న మొదటి కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్






















