CM KCR: గురుకులాల్లో కొత్త మార్పు, ఈఏడాది నుంచే అమలు - కేసీఆర్ కీలక ఆదేశాలు
గురుకులాల్లో ఇంటర్, విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్యను అందించనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పదో తరగతి వరకు విద్య అందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా అమలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు ట్రైనింగ్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇంటర్మీడియట్ కాలేజీలుగా గురుకులాల్లో ఇంటర్, విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కేంద్రాలుగా కూడా
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయ అవకాశాలను అందించేలా రాష్ట్ర ప్రభుత్వ స్టడీ సర్కిళ్లు రూపాంతరం చెందాలి. ట్రైనింగ్ ఇచ్చి క్యాంపస్ రిక్రూట్ మెంట్ సెంటర్లుగా మారాలి. ఎంప్లాయ్‌మెంట్ అవెన్యూస్ గా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలకు ఎంపికయ్యేలా యువతను మార్చాలి. ఇందుకోసం ఫ్యాకల్టీని సమర్థవంతమైన వారిని నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులు కంప్లీట్ చేసిన తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన పాత్రను స్టడీ సర్కిళ్లు పోషించాలి’’ అని కేసీఆర్ నిర్దేశించారు.
కొత్త బీసీ గురుకులాలు కూడా
బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలని సీఎం సూచించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 15 గురుకుల డిగ్రీ కాలేజీలకు మరో మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే సంత్సరం నాటికి మరో రెండు పెంచాలని సూచించారు. మొత్తంగా జిల్లాకు ఓ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ పరీక్షలు-2021లో ఆల్ ఇండియా 86 ర్యాంక్ సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సిఆర్‌ఐ) విద్యార్థి కాసర్ల రాజును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభినందించారు. రాజు స్ఫూర్తితో కాలేజీ నుంచి మరింత మంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. 23 ఏళ్ల కాసర్ల రాజు జనగాం జిల్లా సూరారం గ్రామానికి చెందినవాడు. అతను గత సంవత్సరం బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసాడు. ప్రస్తుతం అతను ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (FCRI)’లో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీని అభ్యసిస్తున్నాడు. ఫారెస్ట్రీ, జియాలజీ లను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకొని అతను ఐఎఫ్‌ఎస్ సాధించాడు. ఎఫ్సీఆర్ఐ (FCRI) వంటి ప్రపంచ స్థాయి సంస్థను స్థాపించి, తనలాంటి విద్యార్థులకు అటవీ విద్యను అభ్యసించడానికి, ఐఏఎస్/ఐఎఫ్ఎస్ వంటి అత్యుత్తమ పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.