Chikoti Praveen News: ముగిసిన చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ, ఏడు గంటల పాటు విచారణ
క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలోనే ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కొన్నిసార్లు చీకోటిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
థాయ్‌లాండ్‌లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలపై ఆ దేశంలో అరెస్టు అయిన తర్వాత చికోటి ప్రవీణ్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు రావాలన్న ఆదేశాల మేరకు చికోటి ప్రవీణ్ ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు 7 గంటల పాటు చికోటి ప్రవీణ్ ను విచారణ చేసిన తర్వాత సాయంత్రం ఆయన ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చారు. చీకోటి సహా ఆయనతో పాటు పట్టుబడ్డ పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలు నగదు బదిలీపై ఆయనను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. విదేశీ డబ్బు లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలోనే ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కొన్నిసార్లు చీకోటిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. థాయ్‌లాండ్ లో అరెస్టు కావడంతో ఇప్పుడు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. చీకోటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తున్న చిట్టి దేవేందర్, మాధవ రెడ్డి, సంపత్‌కు కూడా ఈడీ నోటీసులు అందాయి. ఈడీ నోటీసుల నేపథ్యంలో సంపత్ గతంలో విచారణకు హాజరయ్యారు. మిగతా ముగ్గురు కూడా హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులలో తెలిపింది. తనకు ఆహ్వానం రావడంతోనే థాయ్ లాండ్ వెళ్లి కేసినో ఆడుతుండగా వెంటనే పోలీసులు రంగంలోకి అదుపులోకి తీసుకున్నారని, అక్కడ ఇల్లీగల్ అని తనకు తెలియదని విచారణలో పోలీసులకు తెలిపాడు చికోటి ప్రవీణ్.
కొనసాగుతున్న థాయ్ పోలీసుల విచారణ
మరోవైపు, థాయ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. థాయ్ లాండ్ లోని కోన్ బురి జిల్లా బ్యాంగ్ లా ముంగ్లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో వారిని థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ అతని అనుచరులను అరెస్టు చేసిన సందర్భంలో వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోన్ బురి జిల్లా పోలీసు ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల దాడుల్లో రూ.లక్షా 60 వేల నగదు 92 ఫోన్లు, ఒక ఐపాడ్‌తో పాటు 3 ల్యాప్‌టాప్‌లు, 25 సెట్ల ప్లే కార్డులు సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి చీకోటి ప్రవీణ్ అనుచరుడు మాధవ రెడ్డితో పాటు పలువురు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
థాయ్‌లోని పట్టాయ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపుగా రూ. వంద కోట్ల వరకూ గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మను నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడించిందనేది ఆ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకొని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సారి మొత్తం గుట్టు ఈడీ బయట పెట్టే అవకాశం ఉంది.