![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana News: ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ, అక్రమ రవాణాపై రేవంత్ ఆగ్రహం - తనిఖీలకు ఆదేశం
New Sand Policy in Telangana: ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.
![Telangana News: ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ, అక్రమ రవాణాపై రేవంత్ ఆగ్రహం - తనిఖీలకు ఆదేశం Chief Minister A Revanth Reddy decided to prepare a new sand policy for sale of sand in Telangana Telangana News: ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ, అక్రమ రవాణాపై రేవంత్ ఆగ్రహం - తనిఖీలకు ఆదేశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/168ccb8a4b969f0f43dace820b97a1a61707407686745234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Revanth Reddy orders New Sand Policy: రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు.
రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు. అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్ లు, డంప్ లన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇసుక రీచ్ లన్నింటా సీసీ కెమెరాలున్నాయని అధికారులు ఇచ్చిన సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాదయాత్రకు వెళ్లినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసి.. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని అన్నారు.
ఈనెల 3వ తేదీన రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. 22 లారీలకు అనుమతి లేదని గుర్తించారు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్ తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు బయటపడిందని అన్నారు. ఈ లెక్కన 25 శాతం అక్రమంగా ఇసుక తరలిపోతుందని సీఎం అంచనాగా చెప్పారు.
టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సీఎం అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ మహేష్ దత్ ఎక్కా, మైనింగ్ విభాగపు డైరెక్టర్ సుశీల్ కుమార్ తో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)