Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"
Kishan Reddy Fires on KCR: ప్రజల కోసం బీజేపీ పాదయాత్రలు చేస్తుంటే.. టీఆర్ మాత్రం దాడులు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను వారి సమస్యలను గాలికొదిలేయడం దారుణం అన్నారు.
Kishan Reddy Fires on KCR: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ పోరాటలతో అధికారంలోకి వచ్చి.. అవే పోరాటాలను అణిచివేస్తోందని అన్నారు. ఇలాంటి సర్కారు అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పాదయాత్ర చేస్తుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఫిల్మ్ నగర్ లో జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Attended & Addressed @BJP4Telangana Hyderabad District Executive Committee meeting today.
— G Kishan Reddy (@kishanreddybjp) November 29, 2022
Spoke on the ongoing & upcoming party programmes and called on Karyakartas to undertake voter enrollment at booth level. pic.twitter.com/PEDlKBIx2B
భాగ్యనగరంలో సవాలక్ష సమస్యలు ఉండగా.. నూతన సచివాలయ నిర్మాణం అవసరమా..!
రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కుటుంబ పాలన చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. బీజేపీ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి ఆయువు పట్టు హైదరాబాద్ అని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటికీ ఏం చేయలేకపోయారని అన్నారు. హైదరాబాద్ లో రోడ్ల సమస్యలు, కలుషిత నీరు, ఇండ్ల కోసం పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ఇలా సవాలక్ష సమస్యలున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ... కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి రాష్ట్రాన్ని అప్పజెప్పడం ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు.
ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెట్రో నిర్మాణం పూర్తి చేయండి..
సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు వేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని దాన్ని ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం మెట్రో కోసం రూ.1,250 కోట్ల మెట్రోకి ఇచ్చి అఫ్జల్ గంజ్ వరకే మెట్రోను తీసుకెళ్తూ... పాతబస్తీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రో రాకుండా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు మెట్రో రైలు ప్రాజెక్టును యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా పనులు పూర్తి చేస్తామని ఓ మంత్రి చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన సహకారం మేరకు ముందుగా పాత లైన్ పూర్తి చేయండని పేర్కొన్నారు.