BRS News: తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ మహిళా నేతలు, ఆ ఘటనపై చర్యలకు డిమాండ్
Hyderabad News: ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించిన ఓ వ్యవహారంలో డీజీపీ రవి గుప్తాను కలిసి పూర్తి ఆధారాలతో బీఆర్ఎస్ మహిళలు ఫిర్యాదు చేశారు.
![BRS News: తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ మహిళా నేతలు, ఆ ఘటనపై చర్యలకు డిమాండ్ BRS women leaders met DGP Ravi Gupta to complaint over yellandu Municipality No Confidence Motion BRS News: తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ మహిళా నేతలు, ఆ ఘటనపై చర్యలకు డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/7a5e9a89687534e41f1079d7094397021709043770990234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS Women leaders met DGP Ravi Gupta: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా నేతలు కొందరు డీజీపీ రవి గుప్తాను కలిశారు. ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడి, కిడ్నాప్ ల సంఘటనల విషయంలో దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డీజీపీ రవి గుప్తాను కోరారు. ఈ మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ తదితరులు మంగళవారం (ఫిబ్రవరి 27) డీజీపీని హైదరాబాద్ లో కలిశారు.
డీజీపీ రవి గుప్తాను కలిసి పూర్తి ఆధారాలతో బీఆర్ఎస్ మహిళలు ఫిర్యాదు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ నేతలు దాడులు చేశారని, కిడ్నాప్ లు కూడా చేశారని ఆరోపించారు. ఆ ఘటనల విషయంలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న మహిళలపై దాడుల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడులపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. చర్యలకోసం తగిన ఆదేశాలను ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని నేతలు కోరారు.
ఇల్లందులో అవిశ్వాస తీర్మానం వేళ ఉద్రిక్తతలు
భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఫిబ్రవరి 5న తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం కాగా.. దానిపై అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోనుంది. ఈ క్రమంలో కౌన్సిలర్లను ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ ఛైర్మన్ పై బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం జరగకుండా ఎమ్మెల్యే కనకయ్య దగ్గరుండి అడ్డుకున్నారని చెబుతున్నారు.
కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా తీసుకెళ్లగా, సీపీఐ కౌన్సిలర్‌ను ఆ పార్టీ నాయులు తమవెంట తీసుకెళ్లారు. మున్సిపల్ కార్యాలయానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో అడ్డువచ్చిన మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ను పక్కకు నెట్టి స్థానిక రౌడీల సాయంతో కొక్కు నాగేశ్వరావు కిడ్నాప్ చేయించినట్లుగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)