BRS Protest: మొన్న ఏపీలో.. నేడు తెలంగాణలో రప్పా రప్పా రాజకీయాలు.. బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ప్లకార్డులు వైరల్
మొన్న ఏపీలో.. నేడు తెలంగాణలో రప్పా రప్పా రాజకీయాలు.. బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ప్లకార్డులు వైరల్

జిన్నారం: ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రప్ప రప్ప కామెంట్స్ తెలంగాణలోనూ సెగలు రేపుతున్నాయి. ఇటీవల జగన్ పర్యటనలో వైసీపీ ఫ్లెక్సీల్లో రప్పా రప్పా నరుకుతాం.. అని ఉన్న కామెంట్లు అరెస్టుల వరకు వెళ్లాయి. మాజీ సీఎం జగన్ సైతం అదే డైలాగ్ ను చెప్పడంపై ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. సీఎంగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. తాజాగా బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ప్లకార్డుల్లోనూ రప్ప రప్ప 3.0 అని రాసి ఉండటం కలకలం రేపుతోంది.
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా శనివారం జరిగింది. 2028 లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని జిన్నారంలో నిర్వహిస్తున్న రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలగౌని సాయిచరణ్ గౌడ్ పటాన్‌చెరు నియోజకవర్గం పేరుతో ప్లకార్డులు ఉన్నాయి. జిన్నారంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతు ధర్నాలో పాల్గొని రైతు భరోసా నిధులు విడుదల చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు .... కోతల రేవంత్ రెడ్డి. కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇచ్చారు. నేడు 22 వేల మందికి రైతు భరోసా ఇవ్వడం లేదు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వంలో నాట్ల నాట్ల కు రైతు బంధు.... రేవంత్ ప్రభుత్వంలో ఓట్ల ఓట్లకు రైతు బంధు. మద్యలో రెండుసార్లు రైతు బంధు ఎండబెట్టిండు రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు భీమా కూడా లేదు.
ఉన్న పథకాలు కోతలే తప్పా.. కొత్త పథకాలు లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు భరోసా ఉండేది. ఔటర్ రింగ్ రోడ్డు పై రైతు బంధు రాని రైతులతో ధర్నా చెసి ఓఆర్ఆర్ బ్లాక్ చేస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యలపై ప్రశ్నిస్తున్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిల్లెట్స్, పప్పు ధాన్యాలకు తేడా తెలియని సీఎం. దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియదు. గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని’ హరీష్ రావు స్పష్టం చేశారు.
420 హామీలిచ్చి, అమలు చేయడంలో ఫెయిల్
కాంగ్రెస్ పార్టీ కాదు, బిస్కెట్ల పార్టీ అయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిన్నారం రైతు ధర్నాలో మాట్లాడుతూ.. పొద్దున్న లేవగానే అబద్ధాలు మాట్లాడడం కాంగ్రెస్ వాళ్లకు అలవాటు అయ్యిందంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యాడు.. ఆ పార్టీ మళ్ళీ గెలవదు. జిన్నారం అంటే ఉద్యమాల గడ్డ.. ఖచ్చితంగా ఇక్కడ రైతు భరోసా వచ్చి తీరాలి. అప్పటిదాకా పోరాటాలు చేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. చేతులు ముడుచుకొని కూర్చొంటే ఎవరు ఇవ్వరు.. పోరాటాలు చేయాలని ప్రభాకర్ రెడ్డి అన్నారు.






















