Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు, కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Huzurabad MLA Padi Kaushik Reddy arrested | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. హజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుంచి వరంగల్‌కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని క్వారీ నిర్వాహకుడు మనోజ్ భార్య ఉమాదేవీ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారి పీఎస్‌లో కేసు నమోదైంది. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి. కానీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీలసులు అరెస్టు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు కౌశిక్ రెడ్డి.
హైకోర్టులో కౌశిక్ రెడ్డికి చుక్కెదురు
హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం (జూన్ 17న) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదివరకే ఆ కేసు కొట్టివేతకు నిరాకరించిన తరువాత ముందస్తు బెయిల్ కోరడంపై పిటిషన్ విచారించిన జస్టిస్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. దీనిపై పిటిషనర్ కౌశిక్ రెడ్డి తరఫు లాయర్ టీవీ రమణారావు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తే కనుక పిటిషనర్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా పడింది.






















